పోలీసుల ఆకలి కేకలు..
బందోబస్తులో భోజన సదుపాయాలులేక తిప్పలు
రాజానగరం: పుష్కర బందోబస్తుకు తీసుకువచ్చి, తమ కడుపులు మాడుస్తున్నారని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి వచ్చిన పోలీసులు ఆక్రోశిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికే ఇక్కడకు చేరుకున్న పోలీసు సిబ్బందికి తగిన వసతులు కల్పించడంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. పురుషుల మాటెలావున్నా మహిళా పోలీసుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తాగు నీరు, కాలకృత్యాలు తీర్చుకునే అవకాశం కల్పించకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు.
రోజుకు భోజనాల నిమిత్తం తమకు ఇచ్చేది రూ. 50 అయితే ఒక్కపూటకే రూ. 80 వెచ్చించవలసి వచ్చిందని పలువురు పోలీసులు చెప్పారు. రోజుకు తమకు టీఏగా రూ. 200 చొప్పున ఐదు రోజులకు మాత్రమే ఇచ్చారన్నారు. ప్రస్తుత రోజుల్లో రోజుకు రూ. 50 ఏవిధంగా సరిపోతాయన్నారు.