భూములు ఇప్పించాలని నిరాహారదీక్ష
హాలియా
తమ భూములు మండలంలోని తిర్మలగిరి చెరువులో మునిగిపోయాయని తమకు ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వాలని లేదంటే నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ బాధితులు చందా లక్ష్మమ్మ, పిల్లి పేరమ్మ అనే మహిళా రైతులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తిర్మలగిరి గ్రామంలో తమ తండ్రి శాగం కోటిరెడ్డి నుంచి సంక్రమించిన సర్వే నంబర్ 299, 290, 285, 278, 262, 228లో గల 9 ఎకరాల భూమి తిర్మలగిరి చెరువులో 15 సంవత్సరాల క్రితం మునిగిపోయిందని పేర్కొన్నారు. నాటి నుంచి తమకు భూమిని ఇప్పించాలని లేదంటే నష్టపరిహారం ఇప్పించాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ఈక్రమంలో గత నెలలో ఆర్‌డీఓ, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించామని వివరించారు. సంబంధిత అధికారులు ఐబీ అధికారులతో మాట్లాడి నష్టపరిహారం ఇప్పించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చినప్పటికీ తిప్పుతూనే ఉన్నారని తెలిపారు. గత నెల తహసీల్దార్ తగిన సమాచారం ఇస్తానని చెప్పినప్పటికీ ఏమీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేసే వరకు దీక్షను కొనసాగిస్తామని వివరించారు. కాగా హాలియా ఎస్‌ఐ వెంకట్ బాధితులకు నచ్చజెప్పి సివిల్ కేసులను కోర్టులో తేల్చుకోవాలని నచ్చజెప్పి దీక్ష విరమింపజేశారు.
ఐబి అధికారులే తేల్చాలి
వేణుమాధవరావు, తహసీల్దార్ అనుముల
తిర్మలగిరి చెరువు కింద తమ భూములు కోల్పోయామని పిల్లి పేరమ్మ, చందా లక్ష్మమ్మలు గత ఏప్రిల్ నెలలో ఫిర్యాదు చేశారు. వెంటనే రెవెన్యూ డివిజనల్ అధికారికి సమాచారం నిమిత్తం రాయగా ప్రొవిజన్ కోసం ఐబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత మేనెలలో భూమిని కొలిచాం. మావద్ద ఎటువంటి సమాచార లోపం లేదు. ఐబీ అధికారులే తేల్చాలి.