భార్యను అంతమొందించిన భర్త అరెస్టు
భార్యను అంతమొందించిన భర్త అరెస్టు
Published Wed, Jun 7 2017 12:07 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
పిఠాపురం టౌన్: భార్యపై భర్తకు అనుమానం, తరచూ ఇద్దరి మధ్య గొడవలు.. ఆమె తల్లిదండ్రులు వచ్చి తన మీద కేసు పెడతారనే భయం ఇవన్నీ ఒక వివాహిత మృతికి కారణమయ్యాయి. సరిగ్గా 13 రోజులు క్రితం మే 24న పిఠాపురం మండలం గోకివాడ శివారు జగపతిరాజపురంలో భార్య మృతి చెందిన కేసులో ఆమె భర్తే హంతకుడిగా పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో భర్త, అతడికి సహకరించిన అత్త మామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తను అరెస్టు చేయగా, అత్త మామలు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ అప్పారావు వివరాలు వెల్లడించారు. కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన పెదపాటి సంధ్య (25)కు పిఠాపురం మండలం జగపతిరాజ పురానికి చెందిన సింగులూరి ప్రతాప్ (30)తో 2012లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. భార్యపై అనుమానంతో భర్త ప్రతాప్ తరచూ ఆమెతో గొడవ పడడంతో చాలా కాలం సంధ్య పుట్టింట్లోనే ఉండేది. పెద్దలు రాజీ చేసి ఏడాదిన్నర క్రితం ఆమెను అత్తగారింటికి పంపించారు. సంధ్య చనిపోయిన నాలుగు రోజుల ముందు కూడ ప్రతాప్ సోదరి పురుడు స్నానం సమయంలో మళ్లీ ఘర్షణ పడ్డారు. తన పెదనాన్న కొడుకు పెళ్లికి పంపించలేదని సంధ్య తన భర్త ప్రతాప్‌తో గొడవకు దిగింది. నీవాళ్ల కార్యక్రమాలకు వెళుతున్నావు, మావాళ్ల కార్యక్రమాలకు వెళ్లనీయడం లేదని సంధ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా తన భర్త వద్ద ఉండలేనని తనను పుట్టింటికి తీసుకెళ్లాలని సంధ్య అమ్మానాన్నలకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో సంధ్య తల్లిదండ్రులు వచ్చి తన మీద కేసు పెడతారనే భయంతో ఆమెను భర్త ప్రతాప్ పీకనులిమి చంపినట్టు సీఐ తెలిపారు. ఈ సమయంలో తల్లి రూత్‌కుమారి, తండ్రి సజీవరావులు సహకరించినట్టు ఆయన తెలిపారు. ప్రతాప్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుసున్నామని, అతడికి సహకరించిన నిందుతుడి తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నట్టు ఆయన చెప్పారు. సమావేశంలో పిఠాపురం రూరల్ ఎస్సై కోటేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement