గుంతకల్లు (అనంతపురం) : మద్యానికి బానిసైన భర్తను చంపేస్తే...ఆ ఉద్యోగం కుమారుడికి వస్తుందని భావించిన ఓ మహిళ ఘోరానికి ఒడిగట్టింది. కొడుకు సాయంతో కట్టుకున్నవాడిని కడతేర్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో చోటుచేసుకుంది. గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులు, బంధువుల కథనం మేరకు.. యాడికి మండల కేంద్రంలో విద్యుత్ శాఖలో లైన్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సాల్మన్‌రాజు (48) కుటుంబం పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు రోడ్డులో నివాసముంటోంది.
సాల్మన్‌రాజుకు భార్య ప్రేమలత, కుమారుడు శశాంక్ (24), కుమార్తె స్వరూప(20) ఉన్నారు. సాల్మన్‌రాజు ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో భర్తను చంపితే కుమారుడికి ఉద్యోగం వస్తుందని ప్రేమలత భావించింది. ఆమె కుమారుడితో కలిసి గురువారం మద్యం మత్తులో ఉన్న సాల్మన్‌రాజును చితకబాదటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అయితే.. మెట్లపై నుంచి కిందపడ్డాడని నాటకమాడారు. స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లి చికిత్స చేయించారు.
పరిస్థితి విషమించి సాల్మన్‌రాజు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. శనివారం ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. బంధువులు మాత్రం.. అతని మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒన్‌టౌన్ ఎస్‌ఐ నగేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సాల్మన్‌రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం సాల్మన్‌రాజు భార్య, కుమారుణ్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.