వరుస అవార్డులతో హైదరాబాద్ కాప్స్ | Hyderabad Cops got series of awards | Sakshi
Sakshi News home page

వరుస అవార్డులతో హైదరాబాద్ కాప్స్

Published Thu, Aug 11 2016 8:29 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

వరుస అవార్డులతో హైదరాబాద్ కాప్స్

వరుస అవార్డులతో హైదరాబాద్ కాప్స్

సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగాన్ని మరో జాతీయ స్థాయి అవార్డు వరించింది. సిటీ కాప్స్‌ వినియోగిస్తున్న యాప్స్‌ ‘హైదరాబాద్‌ కాప్‌’, ‘హాక్‌–ఐ’లకు స్కోచ్‌ అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌ ప్రకటించినట్లు గురువారం వర్తమానం అందింది. దేశ వ్యాప్తంగా 2016కు సంబంధించి ప్రఖ్యాతిగాంచిన, ప్రజాదరణ పొందిన 100 యాప్స్‌లో ఈ రెండూ ఉన్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. హైదరాబాద్‌ సిటీ పోలీసులు రూపొందించి, వినియోగిస్తున్న యాప్స్‌కు ఈ ఏడాది ఇప్పటికే మూడు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చిన విషయం విదితమే. 

క్షేత్రస్థాయి నుంచే కీలక వివరాల సేకరణ, నేరగాళ్లు, అనుమానితుల వివరాలు తెలుసుకోవడంతో పాటు సమన్వయం, సత్వర సమాచార మార్పిడి కోసం నగర పోలీసు విభాగం ‘హైదరాబాద్‌ కాప్‌’ పేరుతో యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే బాధితులకు సత్వరం సహాయం అందించడంతో పాటు ప్రజలకు–పోలీసులకు మధ్య సమాచార మార్పిడికి వారధిగా ఉంటూ, బాధితులకు సత్వరం సహాయం అందించేందుకు ‘హాక్‌–ఐ’ని రూపొందించిన సిటీ ఐటీ సెల్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఉంది.

స్కోచ్‌ సంస్థ మెరిట్‌ అవార్డుల కోసం ఎంట్రీలు కోరగా... ఈ రెంటితో పాటు హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు పోటీపడ్డాయి. సిటీ నుంచి వెళ్ళిన మొత్తం 34 ఎంట్రీల్లో ఈ రెంటినే అవార్డ్‌ కోసం ఎంపిక చేశారు. వచ్చే నెల 8–9 తేదీల్లో సైబరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగనున్న కార్యక్రమంలో నగర పోలీసు అధికారులకు నిర్వాహకులు వీటిని ప్రదానం చేయనున్నారు.

ఈ ఏడాది వచ్చిన  అవార్డులు
► ‘హాక్‌–ఐ’ యాప్‌కు మార్చ్‌లో ‘సోషల్‌ మీడియా ఫర్‌ ఎంపవర్‌మెంట్‌–2016’ అంతర్జాతీయ అవార్డు లభించింది. ఆసియాలోని మొత్తం ఎనిమిది దేశాలు 266 ఎంట్రీలు పంపగా... ఈ యాప్‌కు అవార్డు దక్కింది. న్యూ ఢిల్లీలోని ఇండియన్‌ హ్యాబిటేట్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో దీన్ని ప్రదానం చేశారు.
► హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రవేశపెట్టిన బాడీ వార్న్‌ కెమెరాలు, క్యాష్‌ లెస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధానాలకు ఏప్రిల్‌లో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) స్మార్ట్‌ పోలీసింగ్‌ అవార్డును లభించింది. దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాల పోలీసులు, మూడు కేంద్ర రిజర్వ్‌ పోలీసు విభాగాలు 91 ఎంట్రీలు పంపించాయి.
► నగర పోలీసు విభాగం ప్రవేశపెట్టిన ‘హాక్‌–ఐ’కి జూలైలో ఎం.బిలియంత్‌ పేరిట అంతర్జాతీయ అవార్డు లభించింది. ఈ పోటీలకు మొత్తం 340 ఎంట్రీలు రాగా... ప్రభుత్వ విభాగానికి సంబంధించి 8 దేశాలు పోటీపడగా... సిటీ కాప్స్‌కు దక్కింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement