హైదరా‘బాదుడే’
- రవాణా శాఖ దాడులతో నిలిచిన ఏసీ స్లీపర్ బస్సులు
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని ఆర్టీసీ
- ఇదే అదనుగా రేట్లు పెంచేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్
అమలాపురం : అధికార టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని పెట్టిన చిచ్చు హైదరాబాద్ ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతోంది. తన ట్రావెల్స్ సంస్థను మూసివేస్తూ ఇంటి గుట్టును నాని రట్టు చేసిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా అరుణాచల్‌ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన బస్సులను రవాణా అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లాలో కూడా పలు ఏసీ స్లీపర్ బస్సులు నిలిచిపోయాయి. ఉన్న బస్సులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ సమయంలో సర్వీసులను పెంచాల్సిన ఆర్టీసీ నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్ల రేటు పెంచి ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నారు.
జిల్లా నుంచి ప్రతి రోజూ సుమారు 170కి పైగా బస్సులు హైదరాబాద్ వెళుతున్నాయని అంచనా. వీటిలో 30 వరకూ ఏసీ స్లీపర్ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ ఇతర రాష్ట్రాల పర్మిట్లతో తిరుగుతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపణలు చేశారు. దీంతో రవాణా అధికారులు దాడులు చేయడంతో ఈ బస్సులన్నీ నిలిచిపోయాయి. ఒక్కో బస్సులో 25 మంది వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ బస్సులు నిలిచిపోవడంతో ప్రతి రోజూ 750 మంది వరకు ఇతర ఏసీ సెమీ స్లీపర్, నాన్ ఏసీ బస్సులపై ఆధారపడాల్సి వస్తోంది. నిజానికి ఈ సమయంలో ఆర్టీసీ మరిన్ని బస్సులు నడిపితే ఆదాయం పెరగడంతోపాటు, నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది. కానీ, ఆ సంస్థ రెగ్యులర్ సర్వీసులు తిప్పుతోందే తప్ప డిమాండ్‌కు అనుగుణంగా బస్సులను పెంచలేదు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు టిక్కెట్టు రేట్లను అనూహ్యంగా పెంచేశాయి. అమలాపురం నుంచి హైదరాబాద్‌కు గతంలో ఏసీ సెమీ స్లీపర్ బస్సు టిక్కెట్టు ధర రూ.800 వరకూ ఉండగా, ప్రస్తుతం దీనిని రూ.1,100కు పెంచారు. ఆదివారం రాత్రయితే ఏకంగా రూ.1,200 వరకూ వసూలు చేశారు. ఇక నాన్ ఏసీ బస్సు టిక్కెట్టు ధర గతంలో రూ.500ల నుంచి రూ.600 వరకూ ఉండగా, దీనిని ఇప్పుడు రూ.900కు పెంచారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల నుంచి గతంలో ఉన్న టిక్కెట్టు రేటుకన్నా రూ.300, అంతకు మించి పెంచేశారు. చార్జీల పెంపుతో హైదరాబాద్ బస్సు ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ ఉన్న ఏసీ స్లీపర్ బస్సులు యథావిధిగా తిరిగే అవకాశముంది. కానీ, వారు సహితం టిక్కెట్టు ధరను భారీగా పెంచారు. సాధారణ రోజుల్లో రూ.1,200 నుంచి రూ.1,400 వరకూ ఉన్న స్లీపర్ టిక్కెట్ ధర ఇప్పుడు రూ.1,780 పలకడం గమనార్హం. ప్రైవేటు బస్సుల యజమానులు ఇష్టానుసారం చార్జీలు పెంచేసినా రవాణా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వేలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ తరహాలో ధరలు పెంచడం, సీజన్‌లో గంటగంటకూ టిక్కెట్టు ధరలు పెంచడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ దందాపై రవాణా అధికారులు ఇప్పటికైనా స్పందించాలని, ఆర్టీసీ కూడా తన సర్వీసులను పెంచాలని వారు కోరుతున్నారు.