
నా చావుకు ఎవరూ కారణం కాదు: సూసైడ్ నోట్
బాపట్ల టౌన్(గుంటూరు) : విహారయాత్ర కోసమని వచ్చిన ఓ వివాహిత రిసార్ట్స్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా సూర్యలంకలో చోటుచేసుకున్న శనివారం ఉదయం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కాన్పూర్‌కు చెందిన కరాభి త్రిపాఠి (30), భర్త తపన్ త్రిపాఠితో కలిసి కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని మలేషియన్ టవర్స్‌లో నివాసం ఉంటోంది. తపన్ హైటెక్ సిటీలోని బ్యాంక్ ఆఫ్ ఆమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. గత నెలలో కరాభి తన భర్త, చెల్లెలు, ఆమె పిల్లలతో కలిసి సూర్యలంక తీరానికి విహారయాత్రకు వచ్చింది. తీరంలోని రిసార్ట్స్‌లో వీరంతా రెండు రోజులు గడిపారు. గురువారం మధ్యాహ్నం కరాభి భర్తకు ఊరికెళ్లి రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పి బయలుదేరింది. శుక్రవారం ఉదయం సూర్యలంక హరితా రిసార్ట్స్‌కు చేరుకుంది.
అప్పటికే ఆన్‌లైన్‌లో రూము బుక్ చేసుకున్న ఆమెకు రిసార్ట్స్ సిబ్బంది శుక్రవారం ఉదయం 7 గంటలకు రూము ఇచ్చారు. శనివారం ఉదయం బాయ్ వెళ్లి తలుపుతట్టాడు. అయితే ఎంతకు తలుపు తీయకపోవడంతో ఉదయం 9 గంటల వరకు వేచిచూసి కిటికీ తలుపు పగులకొట్టి చూశారు. ఆమె మృతదేహం ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే రిసార్ట్స్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు.. కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. దయచేసి నా భర్తను, కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురిచేయవద్దు’ అంటూ రాసిన సూసైడ్ నోట్ సంఘటన స్థలంలో లభ్యమైంది.