డీసీ వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన కేసు
పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన ఎక్సైజ్ డీసీ
సాక్ష్యాధారాల్ని మాయం చేసిన టీడీపీ నేతలు
బాధితుల ఫిర్యాదుపైనే కేసంటున్న ట్రాఫిక్ పోలీసులు
ఓపీ హెడ్‌కానిస్టేబుల్‌ను బెదిరించిన తెలుగు తమ్ముళ్లు
పోలీసుల నివేదిక ఆధారంగానే ఎక్సైజ్ డీసీపై చర్యలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : తప్పును కప్పి పుచ్చుకోవడానికి మరో తప్పు చేశారన్న సామెత చందంగా.. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మృతికి కారణమైన అబ్కారీశాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆ తప్పు నుంచి బయటపడేందుకు అక్రమార్గాలు వెతుకుతున్నట్టు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, మరొకరి గాయాల కేసులో పోలీసులకు అందిన ఫిర్యాదు, సంఘటన జరిగిన ప్రాంతంలో ప్రత్యక్ష సాక్షి అందించిన వివరాలకు పొంతన లేకపోవడంతో కేసు ఎక్సైజ్ డీసీ మెడకు చుట్టుకునేటట్టు ఉందని అధికారులు చెబుతున్నారు. గురువారం ఎక్సైజ్ డీసీ స్థానిక ట్రాఫిక్ పోలీసులకు తన వాంగ్మూలాన్ని ఇచ్చినట్టు తెలిసింది.
సంఘటన సమయంలో తాను డ్రైవింగ్ చేయలేదని, తన డ్రైవరే కారు నడిపారని, తాను మద్యం మానేసి ఆరునెలలయిందని, ప్రమాద సమయంలో తాను మద్యం సేవించి లేనని స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు పోలీసులు ఆయన వాయిస్ రికార్డ్ చేసినట్టు తెలిసింది. అయితే బాధితులు పక్కాగా ఫిర్యాదిస్తే కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వారిని అరెస్టు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నా టీడీపీ నాయకులు కలుగ చేసుకుని తప్పు డీసీది కాదని, ఆయన డ్రైవర్‌దేనని ఇప్పటివరకు ఉన్న ఆధారాల్ని మాయం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. తొలుత డీసీయే ప్రమాదానికి కారణం అని గుర్తించిన టీడీపీ కార్యకర్తలు, అనంతరం ప్రత్యక్ష సాక్షిపైనా ఒత్తిళ్లు తెచ్చి డీసీకి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నట్టు చెబుతున్నారు.
జరిగిందిదీ...
ఈ నెల 12వ తేదీ రాత్రి పార్వతీపురానికి చెందిన స్విఫ్ట్ డిజైర్ వాహనంలో ఎక్సైజ్‌డీసీ ప్రయాణిస్తున్న వాహన ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. ఈ ఫిర్యాదుతో ట్రాఫిక్ ఎస్‌ఐ సంఘటన స్థలానికి వెళ్లి ఫోటోలు కూడా సేకరించారు. ప్రమాదంలో డీసీకి రక్తపు మరకలు అంటాయి. అదే డీసీ సమీపంలోని రిమ్స్‌కూ విషయాన్ని తెలియజేసేందుకు క్షతగాత్రుడ్ని తీసుకువెళ్లారన్నది ఓ కథనం. ఇదిలా ఉంటే మరుచటి రోజు చోటుచేసుకున్న సంఘటనలు పోలీసుల్నే ఆశ్చర్యపరుస్తున్నాయి.
జెడ్పీ చైర్‌పర్సన్‌కు బంధువుగా చెబుతున్న టీడీపీ కార్యకర్త ఒకరు తన అనుయాయుల్ని వెంటబెట్టుకుని బాధితులకు న్యాయం జరగాలన్న డిమాండ్‌తో రిమ్స్ ఓపీలోని ఓ హెడ్‌కానిస్టేబుల్‌పై ఒత్తిడి తెచ్చి ఎక్సైజ్‌డీసీయే ప్రమాదానికి కారణమని పేర్కొంటూ నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. వాస్తవానికి ఆ నివేదిక వెనువెంటనే పోలీసులకు అందజే సి ఉంటే డీసీ అరెస్టుకు ఆధారమయ్యేది. అదే రోజు మృతుడి కుటుంబసభ్యులతో టీడీపీ నాయకులు, స్వచ్చందసంస్థ నడుపుతూ ఇప్పుడిప్పుడే టీడీపీ నాయకులతో తిరుగుతున్న మరో మహిళ, మద్యం దుకాణాల సిండికేట్ సభ్యులంతా ఎక్సైజ్ డీసీపై కేసు లేకుండా పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు నడిపారన్న ఆరోపణలొచ్చాయి.
కోర్టులచుట్టూ తిరగడం ఎందకు, బీమా ఎప్పుడొస్తుందో తెలియదు అంటూ డబ్బుతో సరిపెట్టుకోవాలని చెప్పిన మీదటే బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డీసీ డ్రైవర్ పేరును ఇరికించినట్లు తెలుస్తోంది. డ్రైవర్ కూడా ప్రసుతం పరారీలో ఉన్నాడు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి అందజేస్తామని పోలీసు అధికారి ఒకరు ధ్రువీకరించారు. పోలీసుల నివేదిక ఆధారంగానే ఎక్సైజ్ డీసీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు.
అమ్మతోడు.. తాగలేదు!
Published Thu, Feb 18 2016 11:34 PM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement