వీరఘట్టం ప్రధాన రహదారిలో వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్న ఎస్‌ఐ (ఫైల్)
సాక్షి, పాలకొండ(శ్రీకాకుళం) : ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో వాహనాలు నడిపే వ్యక్తులు మద్యం తాగిన ఘటనలు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువ. దీంతో పోలీసులు మందు బాబులపై ప్రత్యేక దృష్టి సారించి తరుచూ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని అదుపుచేస్తే రోడ్డు ప్రమాదాలను చాలా వరకూ నివారించవచ్చనేది పోలీసుల భావన. ఈ నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
విస్తృతంగా తనిఖీలు..
పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రధాన రోడ్లు అధికంగా ఉన్నాయి. దీంట్లో ఏజెన్సీ సీతంపేట రహదారి 18 కిలో మీటర్లు పోడవున ఉంది. ఇక్కడ ఉన్న పార్కులు, జలపాతాలు చూసేందుకు అత్యధికంగా యువత ద్విచక్రవాహనాలపై అక్కడు వెళ్లివస్తుంటారు. డివిజన్ కేంద్రం పాలకొండ నుంచి వీరఘట్టం మీదుగా ఒడిశా రాయిగడ అంతరాష్ట్ర రహదారి 95 కిలోమీటర్లు మేర ఉంది. అలాగే నియోజకవర్గ పరిధిలో ఆర్‌అండ్‌బీ రోడ్లు 280 కిలోమీటర్లు వరకూ విస్తరించి ఉన్నాయి. అత్యధికంగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో మద్యం మత్తు కారణంగానే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.
పట్టుబడితే కేసులే
మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తి బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలో వచ్చిన పాయింట్లు ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్‌లో 50 నుంచి 100 పాయింట్లు వరకూ ఉంటే జరిమానా, రెండు రోజుల జైలు శిక్ష విధిస్తున్నారు. వంద పాయింట్లు దాటితే మూడు నెలల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రాష్ట్రం ప్రభుత్వం మద్యం నిషేధంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఇటీవల పోలీసులు తరుచూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తూ మందు బాబులను కట్టడి చేస్తున్నారు.
మితిమీరిన వేగం వద్దు
పాలకొండ మండల పరిధిలో అన్ని ప్రధాన రహదారుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నాం. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు. అలా ఇస్తే వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేసే అవకాశముంది. మితిమీరిన వేగంతో కాకుండా జాగ్రత్తగా వాహనాలు నడపడం మంచింది. ప్రధానంగా మద్యం సేవించి వాహనాలు నడపవద్దు. దీని వలన అనేక అనర్థాలు జరుగుతున్నాయి. యువత ఆలోచించాలి.
సనపల బాలరాజు, ఎస్సై, పాలకొండ.
అవగాహన కల్పిస్తున్నాం
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. మద్యం సేవించి యువకులు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదాలకు గురి అవుతున్నారు. మలుపులు వద్ద అదుపు తప్పుతున్నారు. ఇప్పటికే కళాశాలలు వద్ద ప్రత్యేకంగా అవగాహన సభలు నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు హెచ్చరికలు చేయాల్సిఉంది.
– జి.శ్రీనివాసరావు, సీఐ, పాలకొండ
Comments
Please login to add a commentAdd a comment