'టీడీపీలో చేరాల్సి వస్తే ప్రాణాలైనా త్యజిస్తా'
కడప: అధికార టీడీపీ నాయకుల కుయుక్తులు, కుతంత్రాలకు వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు ఎవరూ లొంగరని వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీలో చేరాల్సివస్తే ప్రాణాలైనా త్యజిస్తానని ఘాటుగా స్పందించారు.
కడపలో మంగళవారం జెడ్పీ సర్వ సభ్య సమావేశంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలకు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి దీటుగా సమాధానమిచ్చారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని వ్యతిరేకించలేదని, చంద్రబాబును పొగడలేదని తెలిపారు. టీడీపీ అంటేనే అసహ్యం వేస్తోందన్నారు. రాజంపేట వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతల మెప్పు పొందడానికి అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడరాదన్నారు.
అలా చేస్తే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లెలో ఇటీవల అధికారికంగా ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించామని, ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా తాను పాల్గొన్నానని తెలిపారు. స్థానిక అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పారు. అయితే అధికార పార్టీ నేతల జోక్యంతో కొందరు ఆ శిలాఫలకాన్ని పగులగొట్టడమే గాక, తమపై తప్పుడు కేసులు పెట్టించారని మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.