'కేసీఆర్ వెళితే అందరూ వెళ్లినట్లే'
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా తలపెట్టిన అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆయనతోపాటు కొద్దిమంది తెలంగాణ నేతల బృందం కూడా అమరావతికి వెళుతోంది. అయితే ఆ బృందంలో కేసీఆర్ కుటుంబసభ్యులైన ప్రజాప్రతినిధులు కూడా ఉంటారా? లేదా? అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఇదే విషయాన్ని కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వద్ద విలేకరులు ప్రస్తావించగా..ఆమె తనదైన శైలిలో జవాబు చెప్పారు. 'నేను అమరావతికి వెళతానా లేదా అనేది పక్కన పెడితే, సీఎం కేసీఆర్ మాత్రం కచ్చితంగా వెళుతున్నారు. ఆయన వెళితే అందరూ వెళ్లినట్లే' అని కవిత పేర్కొన్నారు.
బంగారు బతుకమ్మ ఉత్సవాలను విజయవంతంగా పూర్తయిన తర్వాత బుధవారం తన సొంత నియోజకవర్గం నిజామాబాద్ చేరుకున్న ఆమెకు స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత.. కాంగ్రెస్ నేతల విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణ జాగృతి సంస్థకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా నిధులు అందలేదని, కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.