MLC Kavitha-ED Investigation: గట్టిగా ఎదుర్కొందాం! | CM KCR with Kavitha on ED investigation | Sakshi
Sakshi News home page

MLC Kavitha-ED Investigation: గట్టిగా ఎదుర్కొందాం!

Published Thu, Mar 23 2023 1:27 AM | Last Updated on Thu, Mar 23 2023 3:28 PM

CM KCR with Kavitha on ED investigation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో వరుసగా రెండురోజులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. కవిత కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

తన నివాసంలో ఉగాది పూజలు నిర్వహించిన అనంతరం ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో.. ఈడీ విచారణ తీరుతెన్నులు, వివిధ అంశాలతో పాటు ఫోన్లకు సంబంధించి అడిగిన ప్రశ్నలు, కవిత ఇచ్చిన సమాధానాలు, తదితరాలపై చర్చించినట్లు తెలిసింది.

ఈ కేసును గట్టిగా ఎదుర్కొందామని చెప్పిన కేసీఆర్‌.. భవిష్యత్తులో న్యాయపరంగా, రాజకీయ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై పలు సూచనలు చేసినట్లు సమాచారం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష పూరిత వైఖరిని ఎండగట్టే విధంగా మున్ముందు చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి కూడా భేటీలో చర్చించారు. 

ఈడీ దృష్టికి బీజేపీ ప్రకటనలు? 
విచారణను ప్రభావితం చేసేలా బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు, ఇతర రాజకీయ విమర్శలను ఈడీ దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. బాధ్యతారహితంగా ప్రకటనలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరేందుకు కవిత తరఫు న్యాయవాదుల బృందం ఒక లేఖను సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.   

రేపు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ విచారణ 
ఈడీ విచారణ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ఈ నెల 24న విచారణకు రానుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆరోజు ఏం చెబుతుందనే దాని ఆధారంగానే కవిత విచారణకు సంబంధించి ఈడీ తదుపరి చర్యలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తమ వాదనలు పకడ్బందీగా వినిపించేందుకు న్యాయవాదుల బృందం ఇప్పటికే కసరత్తు చేస్తోందని కవిత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ కేసును న్యాయపరంగా దీటుగా ఎదుర్కోవాలని భావిస్తున్న కవిత.. ఈడీ విచారణ సందర్భంగా ఎదురవుతున్న ప్రశ్నలు, చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు న్యాయ నిపుణుల బృందంతో చర్చిస్తున్నట్లు సమాచారం. న్యాయ నిపుణులు, న్యాయవాదులతో సంప్రదింపులు, సమన్వయం కోసమే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీలో మకాం వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

రాజకీయంగా ఎదుర్కోవడంపై బీఆర్‌ఎస్‌ దృష్టి 
ఈడీ నిష్పాక్షిక విచారణ జరపడం లేదంటూ ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్‌.. కవిత ఎపిసోడ్‌ను రాజకీయంగానూ ఎదుర్కోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు రాష్ట్ర మంత్రులు, అన్ని స్థాయిల నేతలు..కవితకు సంఘీభావం తెలుపుతూ ప్రకటనలు చేస్తున్నారు.

విచారణకు హాజరయ్యేందుకు కవిత ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ నేతలు కూడా వెళుతూ మద్దతుగా నిలుస్తున్నారు. కవితను ఈడీ విచారించడంపై అధికార బీఆర్‌ఎస్, విపక్ష పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణల యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement