మాదాపూర్‌లోని కవిత ఆడపడుచు అఖిల ఇంటి వద్ద ఈడీ అధికారులు
తెరపైకి ఆడపడుచు అల్లుడు మేక శరణ్ పేరు
కవిత అరెస్టు సమయంలో అతని ఫోన్ సైతం స్వాధీనం
అందులో స్కాం సొమ్ము లావాదేవీలు గుర్తింపు
కవిత ఆడపడుచు కుటుంబం పేరిట షెల్ కంపెనీలు?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆమె ఇంట్లో సోదాల సందర్భంగా లభించిన ఆధారాల మేరకు శనివారం హైదరాబాద్‌లో మరోమారు తనిఖీలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి ఏడుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం మాదాపూర్ డీఎస్‌ఆర్ అపార్ట్‌మెంట్స్‌లోని కవిత ఆడపడుచు అఖిల ఫ్లాట్‌తోపాటు ఇతర బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించింది. ఈ సోదాల్లో కవిత ఆడపడుచు అఖిల అల్లుడు మేక శరణ్ పేరు కూడా తెరపైకి వచ్చింది.
కవిత అరెస్టు సందర్భంగా హైదరాబాద్‌లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టిన సమయంలోనూ కవిత భర్త అనిల్‌తోపాటు శరణ్ సైతం అక్కడే ఉన్నారు. సోదాల సమయంలో ఈడీ అధికారులు కవిత, ఆమె భర్త అనిల్, శరణ్తోపాటు కవిత పీఏలు రాజేశ్, రోహిత్‌రావు ఇతరుల ఫోన్లను సీజ్ చేశారు. శరణ్ తీరుపై అనుమానాలు ఉండటంతో ఫోన్లను తనిఖీ చేయగా స్కాంకు సంబంధించిన పలు ఆర్థిక లావాదేవీల అంశాలు బయటపడ్డట్లు సమాచారం. తమ కస్టడీలో కవిత నుంచి సేకరించిన సమాచారం.. గతంలో ఫోన్లలో వెలుగు చూసిన అంశాలను ఆధారంగా చేసుకొనే ఈడీ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది.
లిక్కర్ పాలసీ కుంభకోణంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు ఈడీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ప్రధానంగా గోవా, పంజాబ్ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి హైదరాబాద్ నుంచే రూ. కోట్లు సమకూరినట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో సౌత్ గ్రూప్‌లో కీలకంగా వ్యవహరించిన వారిపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆమె నుంచి సేకరిస్తున్న సమాచారంతో మరికొందరి పాత్రను బయటకు తెస్తున్నారు. ఆర్థిక లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన షెల్ కంపెనీలన్నీ కవిత ఆడపడుచు కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా ఆరా తీస్తే కొత్త కోణాలు వెలుగు చూస్తాయని ఈడీ అధికారులు భావిస్తున్నారు.
ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి: కవిత
తనపై అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రౌస్ అవెన్యూ కోర్టులోకి వెళ్లే క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నలనే పదేపదే అడుగుతున్నారని చెప్పారు. ఏడాది కాలంగా అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులను అరెస్టు చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. తన అరెస్టుపై న్యాయస్థానాల్లో పోరాడతానని కవిత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment