లిక్కర్ స్కాంలో ముడుపులు ఇవ్వడంలో ఆమెకు భాగస్వామ్యం
ఈ కేసులో ఇప్పటివరకు రూ.128.79 కోట్ల సొమ్ము జప్తు చేశాం
కేసుకు సంబంధించి ప్రకటన విడుదల చేసిన ఈడీ
ఈడీ కార్యాలయంలో కవితతో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ
అరెస్టును తప్పుపడుతూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్
ఇంతకు ముందే దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాలతో కలసి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కుట్రపన్నా రని ఈడీ ఆరోపించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఈడీ సోమవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15న హైదరాబాద్‌లోని కవిత నివాసంలో సోదాలు చేశామని, అనంతరం అరెస్టు చేశామని తెలిపింది. సోదాల సమ యంలో కవిత బంధువులు, సన్నిహితులు ఈడీ అధికారులను అడ్డుకున్నా రని పేర్కొంది. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో కవితను హాజరుపర్చగా.. ఏడు రోజులపాటు ఈడీ కస్టడీకి అనుమతించిందని వెల్లడించింది.
ముడుపులలో భాగస్వామ్యం..
ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన, అమలులో కవిత, ఇతరులు ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కలసి కుట్ర పన్నారని తమ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ తెలిపింది. అనుమతులకు బదులుగా ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇవ్వడంలో కవిత భాగస్వామ్యం ఉందని పేర్కొంది. ఢిల్లీ మద్యం విధానం 2021–22 రూపకల్పన, అమల్లో అవినీతి, కుట్రల ద్వారా టోకు వ్యాపారుల నుంచి కిక్‌బ్యాక్‌ల రూపంలో ఆప్‌కు నిరంతరం అక్రమ నిధులు అందాయని ఆరోపించింది.
కవిత, ఆమె సహచరులు ఆప్‌కు ముందస్తుగా చెల్లించిన సొమ్మును రికవరీ చేయాల్సి ఉందని తెలిపింది. ఇప్పటివరకు ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై సహా దేశవ్యాప్తంగా 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని వివరించింది. ఈ కేసులో మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్‌నాయర్ సహా 15 మందిని అరెస్టు చేసినట్టు తెలిపింది. ఇప్పటివరకు రూ.128.79 కోట్లను జప్తు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని వివరించింది.
కవితతో కేటీఆర్, హరీశ్ భేటీ
తమ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ రెండో రోజు సోమవారం కూడా ప్రశ్నించింది. ఉదయం సుమారు గంటన్నర సేపు ఈ విచారణ సాగినట్టు తెలిసింది. ఇక ఈడీ కస్టడీలో ఉన్న కవితతో సోమవారం సాయంత్రం బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, న్యాయవాది మోహిత్‌రావు భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాలపాటు మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఇక తన అరెస్టు సరికాదంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి వారు చర్చించారు.
అరెస్టు అక్రమమంటూ సుప్రీంలో కవిత పిటిషన్
తన అరెస్టు అక్రమం అంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ అరెస్టు, కస్టడీకి ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో కవిత తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఆన్‌లైన్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుండగా, గతంలో ఇచ్చిన హామీకి విరుద్ధంగా దర్యాప్తు సంస్థ వ్యవహరించిందని అందులో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్ ఇంకా రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. అందులోని పలు పేజీల్లోని అంశాలు సరిగా లేవని, వాటిని సరిచేయాల్సి ఉందని రిజిస్ట్రీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
పాత పిటిషన్‌పై నేడు విచారణ
ఈడీ సమన్లను రద్దు చేయాలంటూ గతంలో కవిత దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ బేలా ఎం.త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. కవిత తరఫు న్యాయవాదులు ఆమెను అరెస్టు చేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకురానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment