సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం లేదా శనివారం విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. ఎమ్మెల్సీ కవితకు దర్యాప్తు సంస్థలు నోటీసులు జారీ చేయడం ఇది నాలుగోసారి.
ఇంతకుముందు ఈ ఏడాది మార్చిలో ఆమెకు ఈడీ వరుసగా నోటీసులు జారీ చేసింది. ఆ నెలలో 16, 20, 21వ తేదీల్లో మూడు సార్లు ఆమెను వివిధ అంశాలపై ప్రశ్నించింది. మరోవైపు గతేడాది చివర్లో లిక్కర్ కుంభకోణం అంశంలోనే సీబీఐ కూడా కవితను హైదరాబాద్‌లోని నివాసంలో విచారించింది.
ఇప్పుడు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే శుక్రవారం జరిగే ఈడీ విచారణకు దూరంగా ఉండాలని నిర్ణయించామని.. ఏం చేయాలన్నదానిపై తమ న్యాయ బృందం స్పందిస్తుందని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు.
సుమారు ఆరు నెలల తర్వాత
వరుస నోటీసులు, విచారణలతో సంచలనం సృష్టించిన ఈడీ సుమారు ఆరు నెలలుగా స్తబ్దుగా ఉండిపోయింది. ఇటీవలి పలు పరిణామాల నేపథ్యంలో తిరిగి చర్యలు ప్రారంభించింది. గత కొన్ని నెలల్లో ఈ కేసులో నిందితులైన కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, దినేశ్ అరోరా, శరత్‌చంద్రారెడ్డి, మాగుంట రాఘవ తదితరులు అప్రూవర్లుగా మారారు.
ఈ క్రమంలో కవితకు ఈడీ నోటీసులు రావడం కలకలం రేపుతోంది. గతంలో మూడు సార్లు ఈడీ విచారించినప్పుడు ప్రతిసారి కవితను అరెస్టు చేయవచ్చంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారం మొదలైంది. కొన్నినెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై చర్చ మొదలైంది.
బీజేపీ గ్రాఫ్ తగ్గినందుకే!: బీఆర్‌ఎస్ నేతలు
ఢిల్లీ లిక్కర్ కేసు సమసిపోయినట్టేనన్న అభిప్రాయం నెలకొన్న తరుణంలో తాజాగా ఈడీ నోటీసులివ్వడం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే మూడు పర్యాయాలు విచారించినా.. మళ్లీ విచారణ కోసం ఢిల్లీ రావాలనడం వెనుక బీజేపీ రాజకీయ కుట్ర దాగి ఉందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను ఇబ్బందిపెట్టేందుకే ఈడీ కవితకు నోటీసులు జారీ చేసిందని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ బాగా తగ్గిందనే ప్రచారం, ఆ పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయతి్నస్తున్నారని మండిపడుతున్నారు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. మహిళా బిల్లు ఆమోదానికి కృషి చేయాలంటూ ఇటీవలే 47 రాజకీయ పార్టీల నేతలకు లేఖలు కూడా రాశారు. ఈ క్రమంలో కవితపై ఒత్తిడి తెచ్చేందుకే ఈడీ విచారణను తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు.
ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీని ఎండగడతామని బీఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఈ కేసులో కీలకమైన పలువురు అప్రూవర్లుగా మారిన నేపథ్యంలో కవితకు నోటీసులతో పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన కూడా బీఆర్‌ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
లిక్కర్ స్కాం.. మళ్లీ తెరపైకి!
Published Fri, Sep 15 2023 2:22 AM | Last Updated on Fri, Sep 15 2023 5:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment