- ఎమ్మెల్యే సున్నం రాజయ్య
దుమ్ముగూడెం
దుమ్మగూడెం మండలం ములకపాడులోగల ఐసీడీఎస్ కార్యాలయాన్ని భద్రాచలంలో విలీనం చేస్తే ఊరుకునేది లేదని, దీనిని అడ్డుకునేందుకు ధర్నాకు దిగుతానని ఎమ్మెల్యే సున్నం రాజయ్య హెచ్చరించారు. ములకపాడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని తరలించేందుకుగాను ఫర్నీచర్‌ను తీసుకెళుతున్నారని తెలుసుకున్న రాజయ్య.. గురువారం హైదరాబాద్‌లో ఐసీడీఎస్ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లారు.
ఆ సమయంలో డైరెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచే డైరెక్టర్‌తో మాట్లాడారు. గతంలో భద్రాచలంలో ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాలన్ని పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా దుమ్ముగూడెం మండలంలోని ములకపాడుకు మార్చారని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పరిధిలో 95 పెద్ద కేంద్రాలు, 40 చిన్న కేంద్రాలు ఉన్నాయన్నారు. వీటి ద్వారా 40వేల మందికి పౌష్టికాహారం అందుతోందని చెప్పారు. ఇంతమందికి ఉపయోగపడుతున్న ప్రాజెక్టును భద్రాచలం తరలించడం సరికాదన్నారు. ‘‘జిల్లాల పునర్విభజన పేరుతో పాలనను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం చెబుతుంటే.. మీరేమో ఐసీడీఎస్ కార్యాలయాన్ని ప్రజలకు దూరంగా తరలించడం ఎంతమాత్రం సరికాదు’’ అని వాదించారు. దీనిపై కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని డైరెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం, కలెక్టర్‌తో కూడా ఎమ్మెల్యే మాట్లాడారు. ఐసీడీఎస్ జేడీ రాములును కలిసి వివరాలు తెలిపారు. వినతిప్రతం ఇచ్చారు. ఐసీడీఎస్ కార్యాలయాన్ని తరలిస్తే.. కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. ఆయన వెంట సీఐటీయూ కార్యదర్శి బ్రహ్మాచారి, మండల కార్యదర్శి సిహెచ్.మిత్ర, సీఐటీయూ నాయకురాలు రాధాకుమారి తదితరులు ఉన్నారు. ఈ వివరాలన్నిటినీ ‘సాక్షి’కి ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి ఫోన్‌లో వెల్లడించారు.