‘చూచి’ చూడనట్లు!
‘చూచి’ చూడనట్లు!
Published Mon, Jan 16 2017 10:06 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
- దూరవిద్య పరీక్షల్లో చూచిరాతలు
- విద్యార్థి లేకపోయినా పరీక్షలు
రాయిస్తున్న నిర్వాహకులు
- అభ్యర్థిని బట్టి రేటు నిర్ణయం
- పట్టించుకోని ఎస్‌కే యూనివర్సిటీ అధికారులు
కర్నూలు సిటీ: ఎస్‌కే (శ్రీకృష్ణ దేవరాయల)యూనివర్సిటీ దూర విద్య పరీక్షలు చూచిరాతలుగా మారాయి. సోమవారం నుంచి ఎస్‌కే దూర విద్య పీజీ, డిగ్రీ పరీక్షలు మొదలు అయ్యాయి. ఇందుకు నగరంలోని శ్రీబాలశివ డిగ్రీ, జూనియర్ కాలేజీలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను పర్యవేక్షించేందుకు యూనివర్సిటీ నుంచి వచ్చిన అధికారి ‘చూచి’ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో చూచి రాతలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
వారి రూటు సప‘రేటు’
వివిధ కారణాలతో రెగ్యులర్‌గా కొందరు.. కాలేజీలకు పోయి చదవలేకపోతున్నారు. విద్యార్హత కోసం కొందరు దూర విద్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. వీరి నుంచి యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజులతో పాటు పరీక్షల రోజున ఖర్చుల పేరుతో నిర్వాహకులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో కోర్సుకు..ఒక్కో పరీక్షకు వేర్వేరుగా రేటు కడుతున్నారు. పరీక్షల సమయంలో చూచి రాతలు ఉంటాయని ముందే చెబుతున్నారు. అభ్యర్థి పరీక్ష రాయకపోయినా..వేరొకరితో రాయించి పాస్ చేయిస్తామని ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. దీంతో ఒకప్పుడు వంద మందితో మొదలు అయిన దూర విద్య కేంద్రం నేడు వేల మంది సంఖ్యను పెంచుకుంది. జిల్లాలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాలలో ఏజెంట్‌లను పెట్టి వీరు అడ్మిషన్లు చేయిస్తున్నారు.
పుస్తకాలు పెట్టి పరీక్షలు...!
సాధారణంగా దూర విద్య అంటే సెలవు రోజుల్లో క్లాస్‌లు నిర్వహించాలి. సైన్స్ విద్యార్థులకు ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేయించాలి. పరీక్షలకు నాలుగు నెలలకు ముందుగానే కోర్సు మెటీరియల్ ఇవ్వాలి. అయితే యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతో మెటీరియల్ అందడం లేదు. సమయానికి మెటీరియల్ ఇవ్వకపోవడంతో పరీక్షల సమయంలో మెటీరియల్‌కు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది జరుగుతున్న పరీక్షల్లో.. అధిక శాతం కోర్సులకు సంబంధిత మెటీరియల్‌ను హాల్‌టికెట్‌తో పాటు ఇచ్చారు. దీంతో నేరుగా పరీక్ష కేంద్రంలోనే మెటీరియలో సమాధానాలు చూచి రాస్తున్నారు. దీంతో పాటు ప్రశ్నలకు సమాధానాల చిట్టీలు ఇస్తే ఒక రేటు, మెటీరియల్ ఇచ్చిన వారినే సమాధానాలు వేతుక్కోని రాయమంటే ఒక రేటు నిర్ణయించి వసూలు చేసినట్లు సమాచారం. మొత్తంగా ఒక్కో అభ్యర్థి రూ.1000 నుంచి రూ.2000 వరకు ఇచ్చినట్లు సమాచారం. మరి కొంత మంది పరీక్షలకు హాజరుకాలేకపోయినా.. వారు వారి బదులు మరొకరితో వారే పరీక్ష రాయించాలంటే రూ.10 వేలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. దూర విద్యలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ఈ ఏడాది ఎస్‌కే యూనివర్సిటీ ..దూర విద్య బోర్డును రద్దు చేసి, రెగ్యులర్ పరీక్షల బోర్డు పరిధిలోకి తీసుకువచ్చింది. అయినా కేంద్రాల నిర్వాహకుల తీరు మారలేదు.
Advertisement