‘హద్దు’లేని అక్రమాలు | illegal layouts in hindupur | Sakshi
Sakshi News home page

‘హద్దు’లేని అక్రమాలు

Published Sun, Jan 1 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

‘హద్దు’లేని అక్రమాలు

‘హద్దు’లేని అక్రమాలు

– విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు
– ‘పురం’లో పెచ్చుమీరుతున్న రియల్టర్లు
– మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త ప్లాట్ల విక్రయాలు
– ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి


హిందూపురం అర్బన్‌ : మున్సిపాల్టీ స్థలాలను పర్యవేక్షిస్తూ, అక్రమ లేఅవుట్లను అదుపు చేసి ఆదాయాన్ని పెంపునకు కృషి చేయాల్సిన పాలకులే అక్రమాలకు పాల్పడుతుండడంతో ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. రాజకీయ పలుకుబడితో రియల్టర్లు కూడా ఇష్టారాజ్యంగా అక్రమ లేఅవుట్లు వేసి, భారీ అక్రమాలకు పాల్పడుతున్నారు.

     హిందూపురం పట్టణంలోని నింకంపల్లి రోడ్డు పార్టు-1లో ఓ ప్రజాప్రతినిధి భర్త    సుమారు 11.51 ఎకరాల్లో లేఅవుట్లు వేసి, ప్లాట్లు విక్రయిస్తున్నారు. వాస్తవంగా ఈ భూములను వ్యవసాయ భూమి నుంచి వాణిజ్య భూములుగా మార్చుకోవాలి. ఆ తర్వాత మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అప్రూవల్ పొంది, విక్రయించాలి. అయితే ఇవేవీ లేకుండా డాక్యుమెంట్‌ నం.7036/2011పైకి సర్వే నంబరు 238/1లో 2.13 ఎకరాలు, 241/1లో 2.05, డాక్యుమెంట్‌ నంబర్‌ 196/బీ4,/2012లో 242/2లో 0.85సెంట్లు, 243/2లో 0.97సెంట్లు, 243/1బీలో 1.10 ఎకరాలు, 238/1ఏలో 1.26 ఎకరాలు, 243/1లో 2 ఎకరాలు, 238/1లో 1.21 ఎకరాలు మొత్తం 11.51 ఎకరాల్లో అక్రమంగా ప్లాట్ల విక్రయాలు సాగిస్తున్నారు.

ఇందులో రోడ్లు, కాల్వలు, ఇతర అవసరాలకు స్థలాలు వదిలితే మొత్తం 240 ప్లాట్లు వేసుకోవచ్చు. అయితే సుమారు 284 ప్లాట్లు వేశారు. దీంతో భవిష్యత్తులో కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు వచ్చే అవకాశమూ లేకపోలేదు. అలాగే పట్టణ నడిబొడ్డున çపులమతి రోడ్డు సమీపంలోని డీఆర్‌ కాలనీలో కూడా సర్వే నంబరు 482/1సీలో 2.94 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లతో ప్లాట్లు విక్రయాలు, అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.

లేఅవుట్ల నంబర్లతో ఫ్లెక్సీలు :
    మున్సిపాల్టీ అనుమతి లేకుండా వెంచర్లు వేసిన సర్వే నంబర్లను బహిరంగంగా ఫ్లెక్సీల్లో వేసిన వాటికి మున్సిపాల్టీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అందులో రెండు సర్వే నంబర్లు కనపరచలేదని మిగిలిన రియల్టర్లు విమర్శిస్తున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తూ కంటికి కనిపిస్తున్న వాటిని వదిలేసి ఇతరులను వేధిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి.   

అనుమతులు తీసుకోవాలి ఇలా..
- మున్సిపాల్టీ, పంచాయతీల నుంచి అప్రూవల్స్ పొంది, సెస్‌ చెల్లించాలి.  
- లేఅవుట్‌ వేసే స్థలంలో ప్రభుత్వానికి 20 శాతం సెస్‌ రూపంలో చెల్లించి, ముందుగా మున్సిపాల్టీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులతో అప్రూవల్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది.
- వ్యవసాయ భూములైతే ఆర్డీఓకు దరఖాçస్తు చేసుకొని, సెస్‌ మొత్తాన్ని చెల్లించి కమర్షియల్‌ ల్యాండ్‌గా మార్చుకోవాలి.
- అనంతరం పంచాయతీ, మున్సిపాల్టీ అధికారులకు దరఖాస్తు చేసుకొని వెంచర్‌లో మధ్యలోగానీ లేదా చివరి భాగంలో ప్రభుత్వ అవసరాల నిమిత్తం కొంత స్థలాన్ని కేటాయించి, మున్సిపాల్టీ పేరిట రిజిష్టర్‌ చేయాలి.
- అలాగే రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలకు అవసరమైన నిర్దేశిత స్థలాలను వదిలేసి,ప్లాట్లు వేయాలి.
- ఇన్ని చేస్తే భారీగా పన్ను చెల్లించడంతో పాటు ఆదాయం కూడా కోల్పోవాల్సి వస్తుందని, కొద్ది స్థలాన్ని కూడా వదలకుండా రియల్టర్లు అక్రమ లేఅవుట్ల ద్వారా ప్లాట్లు విక్రయాలు చేస్తున్నారు.

నోటీసులు జారీ చేశాం
అక్రమ లేఅవుట్లు, అనుమతులు లేని భవనాలను గుర్తించి ఇప్పటికే ఐదుగురిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశాం. ఐదు భవనాలను కూల్చివేస్తున్నట్టు నోటీసులు కూడా జారీ చేశాం. త్వరలోనే వాటిపై చర్యలు తీసుకుంటాం.
- విశ్వనాథ్, కమిషనర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement