కాలువల్లో ఇద్దరి గల్లంతు
Published Fri, Sep 16 2016 1:45 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
పెదవేగి రూరల్ : కాలువల్లో పడి గురువారం ఇద్దరు గల్లంతయ్యారు. పోలవరం కాలువలో పడిన గొర్రెను కాపాడే క్రమంలో లింగపాలెం మండలం ధర్మాజీగూడెం ప్రాంతానికి చెందిన బళ్లారి వెంకటేశ్వరరావు(66) గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. బళ్లారి వెంకటేశ్వరరావు దెందులూరు మండలం మేధినరావుపాలెంలో ఓ రైతు దగ్గర కమతం ఉంటున్నాడు. గొర్రెలను మేపుతుండగా ముండూరు సమీపంలో పోలవరం కుడి కాలువలో ఓ గొర్రె ప్రమాదవశాత్తు పడిపోయింది. దీంతో దానిని కాపాడేందుకు వెంకటేశ్వరరావు కాలువలో దిగి అతికష్టంపై గొర్రెను ఒడ్డుకు చేర్చాడు. కానీ వెంకటేశ్వరరావు మాత్రం కాలువలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. పెదవేగి తహసీల్దార్ ఎం.ఇందిరాగాంధీ, ఆర్‌ఐ శేషారెడ్డి, ఎస్‌ఐ వి.రామకోటేశ్వరరావు, ఏఎస్సై రఘురావులు గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
వెంకయ్య వయ్యేరులో..
చినకాపవరం(ఆకివీడు) : తరటావకు చెందిన మల్లారెడ్డి నాగార్జున(50) గురువారం వెంకయ్యవయ్యేరు పంట కాలువలో పడి గల్లంతయ్యాడు. అతని కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలో నీరు అధికంగా ఉండడంతో నాగార్జున ఆచూకీ లభ్యం కాలేదు. నాగార్జున కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మతిస్థిమితం లేకుండా ఉన్నాడని స్థానికులు తెలిపారు.
Advertisement