సంక్రాంతి నుంచి నిమ్స్‌లో ఇన్‌పేషెంట్ సేవలు
సంక్రాంతి నుంచి నిమ్స్‌లో ఇన్‌పేషెంట్ సేవలు
Published Sat, Sep 10 2016 9:49 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
బీబీనగర్ : బీబీనగర్ నిమ్స్ యూనివర్సిటీలోని నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు త్వరితగతిన పూర్తి చేస్తే సంక్రాంతి నుంచి ఇన్‌పెషెంట్ సేవలను ప్రారంభిస్తామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. నిమ్స్ యూనివర్సిటీలోని ఇన్‌పెషెంట్ విభాగం కోసం కొనసాగుతున్న నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రోగులకు సౌకర్యవంతంగా ఉండేలా భవన నిర్మాణ పనులను తిరిగి చేపడుతుండడంతో జాప్యమవుతుందన్నారు. నిమ్స్‌ను మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నామని అన్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా ఎమర్జెన్సీ వార్టులోకి నేరుగా అంబులెన్స్ వచ్చేలా, భవనంలోని లిప్టులు, ర్యాంపులు ఏర్పాటు చేసేందుకు అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు. సొంత నిధులను వెచ్చించి రహదారిపై బస్‌స్టాప్‌లు ఏర్పాటు చేయిస్తానన్నారు. నిమ్స్ వద్ద రహదారిపై నుంచి పుట్‌ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసేలా హైవే అధికారులతో మాట్లాడుతానని పేర్కొన్నారు. నిమ్స్‌లోని ఇన్‌పెషెంట్‌ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని దీంతో సంక్రాంతి నుంచి ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎయిమ్స్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం ప్రజా ప్రతినిధులు కొన్ని సందర్బాల్లో చెప్రాసీ పనులు చేయక తప్పడం లేదని అన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Advertisement