పీపీపీలో డయాలసిస్ కేంద్రాలు
పీపీపీలో డయాలసిస్ కేంద్రాలు
Published Sat, Oct 15 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం, తణుకు ప్రభుత్వాసుపత్రుల్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు డీసీహెచ్‌ఎస్ కె.శంకరరావు తెలిపారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు శనివారం వైద్యులు, పట్టణవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రాల నిర్వహణకు జంగారెడ్డిగూడెంలో రోటరీ క్లబ్, తణుకులో లయన్స్ క్లబ్ ముందుకు వచ్చాయన్నారు. వీటి భాగస్వామ్యంతో రెండు నెలల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఏలూరు, తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
త్వరలో వైద్యనిపుణుల నియామకం
త్వరలో ఏపీపీఎస్సీ ద్వారా జిల్లాలోని ఆయా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకం చేపట్టనున్నట్టు డీసీహెచ్‌ఎస్ శంకరరావు తెలిపారు. జిల్లాలో 18 మంది స్పెషలిస్టులు, 12 మంది సివిల్ సర్జన్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో వైద్యసేవలు అందించేందుకు, వైద్యసేవలు మెరుగుపర్చేందుకు ఈ ప్రాంత నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఇటీవల ఆసుపత్రిలో ప్రసూతి సేవలు నిలిచిపోవడంతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో గర్భిణులు ఎక్కువ రక్తహీనత కలిగి ఉంటున్నారని చెప్పారు. రక్తం అందుబాటులో లేక ఇక్కడ వైద్యం అందించలేకపోతున్నారన్నారు. ఆసుపత్రిలో ఆప్తమాలజిస్ట్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, త్వరలో నియామకం చేపడతామన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ దల్లి కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ డి.భాస్కరరావు, వైద్యులు, ఆసుపత్రి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement