కలెక్టర్ తీరుకు నిరసనగా ‘విద్యార్థి బ్యాలెట్’
- కేవీఆర్ కాలేజీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోలింగ్
- ఓటింగ్‌లో పాల్గొనేందుకు బారులు తీరిన విద్యార్థినీలు
కర్నూలు(వైఎస్‌ఆర్ సర్కిల్):
కేవీఆర్ కాలేజీ విద్యార్థినుల విషయంలో కలెక్టర్ నిరంకుశ వైఖరికి నిరసనగా శనివారం కాలేజీలో ఏర్పాటు చేసిన విద్యార్థి బ్యాలెట్‌కు అనూహ్య స్పందన లభించింది. ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐడీడబ్ల్యూఏ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలింగ్‌లో పాల్గొనేందుకు విద్యార్థినులు ఉదయం నుంచే బారులు తీరడం విశేషం. మొత్తం 2,500 మందికిగాను 2495 మంది ఓటు వేసి కలెక్టర్ తీరును బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, రంగన్న, ఆనంద్, రాజ్‌కుమార్, ఏఐడీడబ్ల్యూఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిర్మలమ్మ మాట్లాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన జిల్లా కలెక్టర్ అనుచితంగా ప్రవర్తించడం దారణమన్నారు. కొన్నేళ్లుగా కాలేజీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విన్నవించేందుకు వెళ్లిన విద్యార్థినులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పటికైనా నియంత పాలన, నియంతృత్వ పోకడలను విడనాడి ప్రజా, విద్యార్థి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇప్పటికే ఉద్యమ కార్యచరణ ప్రణాళిక రూపొందించామని, మహోగ్రరూపం దాల్చకమునుపే సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. విద్యార్థి సంఘాల నాయకులు భాస్కర్, ప్రతాప్, భీమన్న, ఏసన్న, రాము, ప్రసాద్, సుజాత, శారద, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.