
కలెక్టర్‌గారూ.. తీరు మార్చుకోండి
- ప్రణాళికలోపంతోనే వలసలు
- ఫారంపాండ్ పనుల్లో టీడీపీ నేతల దోపిడీ
- ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్
అనంతపురం టౌన్ : జిల్లాకు చెందిన కూలీలు అదనపు ఆదాయం కోసమే వలస వెళ్లారని కలెక్టర్ కోన శశిధర్ అన్నారని, ఇది దారుణమని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ అన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ తన తీరు మార్చుకోవాలని సూచించారు. ఉపాధి కూలీల వలసలు అరికట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం డ్వామా కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ కూలీలు, రైతులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడానికి కలెక్టర్‌తో పాటు డ్వామా పీడీ కారణమన్నారు. సకాలంలో ప్రణాళికలు తయారు చేసి ఉపాధి పనులు కల్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. వలస వెళ్లిన కూలీలను స్వగ్రామాలకు రప్పించడంలో ప్రభుత్వం, అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేదల ఆకలి తీర్చేదిగా లేదని, టీడీపీ నేతలకు దోచిపెట్టేదిగా ఉందన్నారు. ఫారంపాండ్ల పనులు కూలీలతో చేయించాల్సి ఉన్నా జేసీబీలను పెట్టి రాత్రికి రాత్రే తవ్వించి బిల్లులు స్వాహా చేశారన్నారు. జాబ్‌కార్డుతో నిమిత్తం లేకుండా పని చేసే ప్రతి వ్యక్తికి 200 రోజులు పనులు కల్పించాలన్నారు. రోజు వేతనం రూ.400 చెల్లించాలని, పని ప్రదేశంలో ప్రమాదం జరిగితే ఇచ్చే పరిహారాన్ని రూ.50 లక్షలకు పెంచాలన్నారు.
అన్నీ విరుద్ధ ప్రకటనలే..
జిల్లాలో కూలీల వలసలపై కలెక్టర్ కోన శశిధర్, డ్వామా పీడీ నాగభూషణం విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ ఆరోపించారు. ధర్నాకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో జాబ్‌కార్డులు ఉన్న ఎంత మంది కూలీలకు ఉపాధి పనులు కల్పిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణం వలస కూలీలను రప్పించి పనులు కల్పించాలన్నారు. పనులకు సంబంధించి బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి కేవీ రమణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.