శ్రీశైలానికి పెరిగిన వరద
శ్రీశైలం ప్రాజెక్టు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి శుక్రవారం 60వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం సమయానికి సుమారు 4 టీఎంసీల నీరు వచ్చి చేరింది. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువ నాగార్జున సాగర్‌కు 7,063 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 1,680 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 165.9244 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 875.50 అడుగులకు చేరుకుంది. డ్యాం పరిసర ప్రాంతాల్లో 27.60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.