పెరిగిన రైతు ఆత్మహత్యలు
♦ బాబు జమానాపై సీపీఎం నేత మధు విమర్శ
♦ జగన్ చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతని వెల్లడి
సాక్షి, గుంటూరు: చంద్రబాబు ఏరోజునైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆనాటి నుంచి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.మధు విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష శిబిరానికి శనివారం వచ్చి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గతంలో అక్కడక్కడ ఒకటో, రెండో రైతు ఆత్మహత్యలు జరిగేవని, చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత రోజుకు ఐదు నుంచి ఆరుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ‘రైతులకు రుణమాఫీ చేస్తామంటూ దాన్ని అటకెక్కించారు.
రైతులకు ఏటా ఇచ్చే రుణాల్లో చంద్రబాబు సగం కూడా ఇవ్వలేదు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.’ అని ఆయన పేర్కొన్నారు. ‘రాజధాని శంకుస్థాపన కార్యక్రమం అదిరిపోవాలంటూ అందుకు రూ. 400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎవడబ్బ సొమ్మని ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు’ అని మధు మండి పడ్డారు. ‘విశాఖపట్నంలో ఒకే రోజు ముగ్గురు కార్మికులు చనిపోతే ఆందోళన చేస్తున్న ట్రేడ్‌యూనియన్ల సంగతి తేల్చాలని పోలీసులకు హుకుం జారీ చేశారు. చంద్రబాబు తండ్రి, తాత పుట్టకముందే ట్రేడ్ యూనియన్‌లు వచ్చాయి.
అదేవిధంగా అసైన్డ్ భూములకు నష్ట పరిహారం చెల్లించాలని రాజధానిప్రాంతంలో ఆందోళన చేస్తుంటే పోలీసులు కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొంటే ఆ ఉధృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకుపోతాయి. కేంద్రంలోని ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ చెప్పి, తీరా ఇప్పుడు మాట మారుస్తున్నారు’ అని మధు విమర్శించారు. ఈనెల 16న విజయవాడ నగరంలో రాష్ట్రస్థాయి పౌర హక్కుల సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.