కౌలు రైతుకు కన్నీరేనా! | Increasing investments | Sakshi
Sakshi News home page

కౌలు రైతుకు కన్నీరేనా!

Published Tue, Aug 29 2017 2:10 AM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM

కౌలు రైతుకు కన్నీరేనా!

కౌలు రైతుకు కన్నీరేనా!

►  పెరుగుతున్న పెట్టుబడులు
► అందని ప్రభుత్వ సాయం


జిల్లాలో కౌలు రైతు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రకృతి విపత్తులు, చీడపీడల వల్ల పంట నష్టాలు జరిగినప్పడు వారికి పరిహారం రావట్లేదు. బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, బీమా వంటి సదుపాయాలు వారిని చేరడం లేదు. దీంతో నూటికి 70 శాతం భూమిని సాగు చేస్తున్న జిల్లాలోని 2.5 లక్షల మంది కౌలు రైతులకు చివరకు కన్నీరే మిగిలే పరిస్థితులు నెలకొన్నాయి.

అమరావతి (పెదకూరపాడు) : ప్రస్తుతం గ్రామాలలో భూ యజమానులు వ్యవసాయం చేయటం లేదు. వారు భూమిని కౌలు ఇచ్చేస్తున్నారు. ఇలా జిల్లాలో సుమారు 70 శాతం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. అయితే, వారికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు ఏవీ అందడం లేదు. దీంతో అప్పుల పాలై పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

సాగు చట్టం వల్ల ఒరిగిందేమీ లేదు
కౌలు రైతులకు ప్రోత్సాహకాలు అందించాలనే ఉద్దేశంతో 2011లో ప్రభుత్వం భూ అ«ధీకృత సాగు చట్టం అమల్లోకి తెచ్చింది. భూ అధీకృత రైతులను గుర్తించేందుకు ఉద్దేశించిన ఈ చట్టం కూడా కౌలు రైతులను ఆదుకోవట్లేదు.

ఆదుకోని రుణార్హత కార్డు
కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వటానికి, ప్రభుత్వ పోత్సాహకాలు అందచేయటానికి రాష్ట్ర ప్రభుత్వం రుణ అర్హత కార్డులను పంపిణీ చేసింది. జిల్లాలో 2.5 లక్షల మంది కౌలు రైతులు ఉంటే గత మూడేళ్లుగా వరుసగా సుమారు 40 వేలు, 27 వేలు, 23 వేల కార్డులు మాత్రమే అందించింది. ఈ కార్డుల వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం కలగకపోవటంతో కౌలు రైతులు ఈ ఏడాది వీటిని తీసుకోవడానికి ఆసక్తి చూపటం లేదు. అయితే, దేవాదాయ, అసైన్డ్‌ భూములకు రుణఅర్హత కార్డులు కూడా ఇవ్వటం లేదు.

పెరుగుతున్న పెట్టుబడులు..
ఏయేటికాయేడు సాగుకు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. గతంలో కం టే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలి రేట్లు విపరీతంగా పెరిగాయి. వీటికితోడు కౌలు రేట్లు కూడా భారీగా పెరగటంతో కౌలు రైతులకు నానాటికి ఖర్చులు పెరిగిపోతున్నాయి. గతంలో ఎకరా సాగు చేయటానికి సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చయ్యే ది. అది ఇప్పుడు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతోంది. అదేమిర్చి పంట వేస్తే లక్షకుపైగా ఖర్చు చేయాల్సిందే.గతం కంటే ప్రస్తుతం ఎకరాకు రూ.25 వేలు వర కు పెట్టుబడులు పెరిగిపోయాయి.

మూడేళ్ళుగా ఇచ్చింది రూ.43 కోట్లు..
గత మూడేళ్లుగా జిల్లాలో వ్యవసాయం కోసం వివిధ బ్యాంకుల ద్వారా వందల కోట్ల రూపాయలు రుణాలు ఇస్తే అందులో కౌలు రైతులకు గ్రూపు రుణాలు, వ్యక్తిగత రుణాల కింద ఇచ్చింది కేవలం రూ.43 కోట్లు మాత్రమే. వందల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలను భూమికి దూరంగా ఉన్న వ్యవసాయం చేయని భూ యజమానులు పొందటంతో సాగు చేసే కౌలు రైతులు ప్రైవేటుగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందిప

కౌలు రైతుల్లో నేటికీ అయోమయం
ఒకపక్క ఖరీఫ్‌ సీజన్‌ మొదలై రెండు నెలలు దాటినా కౌలు రైతులు బ్యాంకుల నుంచి రుణాలు అందించటంలో జాప్యం జరుగుతూనే ఉంది. దీంతో రుణాలు అందుతాయో లేదోనని అయోమయ స్థితిలో  ఉన్న కౌలు రైతులు అధిక వడ్డీలకు అప్పులు, ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికైనా బ్యాంకుల ద్వారా నేరుగా రుణాలు, పంటల బీమా సదుపాయం. ప్రకృతి విపత్తుల నుంచి నష్ట పరిహారం, ప్రభుత్వ సబ్సిడీలు అందించే విధంగా చర్యలు తీసుకుని కౌలు రైతులను కాపాడకపోతే వ్యవసాయం కుంటుపడుతుంది.

కౌలు చెల్లించలేకపోతున్నాం..
గతేడాది గిట్టుబాటు ధర లేక నష్టాలు చవి చూడటంతో   భూములకు కౌలు కట్టలేకపోతున్నాం. వ్యవసాయ ఖర్చు పెరిగినా, ఆదాయం తగ్గినా కౌలు మాత్రం తగ్గటం లేదు. నీటి వసతి ఉన్న పొలాలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఉండగా మిగిలిన భూములు రూ.10 వేలు కౌలు కట్టాల్సి వస్తోంది. భవిష్యత్‌లో ఇలా  అయితే సాగు చేయలేం.
– కళ్లం భాస్కరరావు, కౌలు రైతు, నెమలికల్లు

ప్రయోజనాలు అందేలా చూడాలి..
ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ప్రయోజనాలు కౌలు రైతులకు అందేటట్లు చూడాలి. నష్ట పరిహారం, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ  సబ్సిడీలు కౌలు రైతులకు అందించేలా ప్రభుత్వం విధి విధానాలు రూపొందించాలి. కౌలు రైతులకు కూడా పంటల బీమా సౌకర్యం కల్పించాలి. లేదంటే కౌలు రైతుల మనుగడ కష్టంగా మారుతుంది.
– ఆర్‌.రామకృష్ణనాయక్, రైతు, పెదమద్దూరు

పాలకులు పట్టించుకోవట్లేదు..
ఏళ్ల తరబడి నష్టాలు చవి చూస్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదు. వ్యవసాయం చేసేవారిలో సుమారు 70 శాతం మంది కౌలు రైతులే. వీరిని నిర్లక్ష్యం చేస్తే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినట్లే. ఇప్పటికైనా కౌలు రైతులకు పెట్టుబడికి రుణాలు, సాగుకు సబ్సిడీలు అందించి ఆదుకోవాలి. – చింతల భాస్కరరావు, అధ్యక్షుడు, అమరావతి ఏరియా రైతు సంఘం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement