చట్టాలకు భారత రాజ్యాంగం తల్లిలాంటిది
కర్నూలు(హాస్పిటల్): చట్టాలన్నింటికీ భారత రాజ్యాంగం తల్లిలాంటిదని జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎంఏ సోమశేఖర్ అన్నారు. గురువారం ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెమినార్ హాలులో కళాబంధు కళాపరిషత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యా విలువలు–మానవ హక్కులు అనే అంశంపై రెండో రోజు జాతీయ సదస్సు సంస్థ అధ్యక్షుడు ఎ. సర్దార్‌బాషా అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలని సూచించారు. లక్షలోపు ఆదాయం ఉన్న మహిళలకు న్యాయాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. మానవ విలువలతో కూడిన విద్యా విధానం ప్రస్తుత సమాజానికి అవసరమని చెప్పారు. ఎస్‌ఎస్‌టీ సంస్థ డైరెక్టర్ వి. ఆంజనేయులు మాట్లాడుతూ తల్లి గర్భం నుంచే శిశువు నిరంతర విద్యను అభ్యసించడం ప్రారంభమవుతుందన్నారు. విలువల అభ్యాసానికి మొదటి మెట్టు కుటుంబమని పేర్కొన్నారు. వ్యక్తులలో పూర్వపు ఆధ్యాత్మికత, సేవాతత్వం ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. ఒక వ్యక్తి నీటిలో పడితే సెల్ఫీ ఫొటో తీస్తారని, కానీ హాస్పిటల్‌కు పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య వ్యక్తిత్వ వికాసానికి, సమాజ వికాసానికి, దేశాభివద్ధికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో రాయలసీమ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జి. రామకష్ణ, ఎస్టీబీసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీహెచ్ మనోరమ, సైకాలజిస్టు పి.లక్ష్మన్న, నందికొట్కూరు డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. బడేసాహెబ్, ఎస్‌ఆర్‌ఈఈ సంస్థ కార్యదర్శి కొమ్ముపాలెం శ్రీనివాసులు, న్యాయవాధి వాడాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.