అటకెక్కిన ఇందిర జలప్రభ | Indira atakekkina jalaprabha | Sakshi
Sakshi News home page

అటకెక్కిన ఇందిర జలప్రభ

Published Sat, Aug 13 2016 4:49 PM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM

అటకెక్కిన ఇందిర జలప్రభ - Sakshi

అటకెక్కిన ఇందిర జలప్రభ

జల‘ప్రభా’వం ఏదీ?

దౌల్తాబాద్‌ మండలం రాయపోల్‌ గ్రామంలో ఆర్‌ఐడీఎఫ్‌ –17ద్వారా ఐదు పథకాలు మంజూరయ్యాయి. 50 ఎకరాలకుపైగా బీడుభూములను సాగులోకి తేవడమే లక్ష్యంగా ఉంది. ఇందుకోసం సుమారు 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ పథకాలు పూర్తి కావాలంటే సుమారు రూ. 10 లక్షలకుపైగా నిధులు విడుదల కావాలి. కానీ ఈ వ్యవహారం ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉంది. అసలు నిధులు వస్తాయో... రావో...? తెలియక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

గ్రామానికి చెందిన ఇందిర జలప్రభ లబ్ధిదారు పుట్ట శంకరయ్య, అతని కుమారుడు రాజులు ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘ఏడాదిన్నర కిందట బోరు ఏసిండ్రు... ఇప్పటి వరకు కూడా ఇంకా కరెంటు కనెక్ష ఇవ్వలేదు. ఎదురు చూసుడే అయితుందే తప్ప ఒస్తదో... రాదో తెల్వకుండాపోయింది. గిట్లయితే ఎట్ల’
అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

  • పథకానికి  మంగళం!
  • హా నిధుల కొరతతో చతికిల
  • హా అసమగ్రంగా పనులు...
  • హా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల్లో నిరాశ
  • హా మహానేత వైఎస్‌ ఆశయాలపై నీళ్లు
  • హాప్రత్యేక రాష్ట్రంలోనూ మారని దుస్థితి
  • హా జిల్లాలో పరిస్థితి దయనీయం

గజ్వేల్‌:బీడుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రవేశపెట్టిన ‘ఇందిర జల ప్రభ’ పథకం నిధుల కొరతతో చతికిల పడింది. పథకానికి ప్రభుత్వం మంగళం పాడబోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ ప్రవేశపెట్టిన ఈ పథకంపై...ఆ మహానేత మరణం తర్వాత నీలినీడలు కమ్ముకున్నాయి.

ఏళ్ల కిందట మంజూరైన పథకాలకు ఇంకా బోర్‌ మోటారిస్తే.. కరెంట్‌ ఇవ్వలేదు.. కరెంటిస్తే బోర్‌ మోటార్‌ ఇవ్వలేదు.. ఫలితంగా ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందా.. లేదా..? అనే ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొన్నది. నామమాత్రంగా భూపంపిణీ చేపడుతూ.. దళితుల బీడు భూముల అభివృద్ధి పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బీడుగా ఉన్న ఎస్సీ, ఎస్టీల భూములను సస్యశ్యామలం చేసి వారి జీవితాల్లో వెలుగు నింపడానికి 2004, నవంబరులో ‘ఇందిర ప్రభ’ పేరిట అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ప్రధానంగా అసై భూములు లేదా దళితుల పట్టా భూములను ఈ పథకం కింద అభివృద్ధి చేస్తారు. సుమారు 10 నుంచి 20 ఎకరాలను యూనిట్‌గా తీసుకొని 10 మందికిపై ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను గ్రూపుగా మార్చి.. వారి భూముల్లో బోరుబావులు వేయించి కరెంట్‌ కనెక్షన్‌ ఇచ్చారు.

ఈ పథకం 2009 వరకు బాగానే నడిచింది. వైఎస్‌ మరణం తర్వాత  2011లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ‘ఇందిర జల ప్రభ’గా మార్చారు. కానీ పథకం నిర్వహణ తీరు అధ్వానంగానే సాగింది. గత ప్రభుత్వం చివరి దశలో ఆర్‌డీఎఫ్‌ (రూరల్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌) –14 కింద జిల్లాలోని ఆందోల్, గజ్వేల్, మెదక్, నారాయణఖేడ్, నర్సాపూర్, రామాయంపేట, సిద్దిపేట, జహీరాబాద్‌ క్లస్టర్ల పరిధిలో 54,105 ఎకరాలను సాగులోకి తీసుకువచ్చేందుకు 5,082 బోరుబావులను తవ్వించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.58.27కోట్లకుపైగా వెచ్చించాలని నిర్ణయించారు.

కానీ ఇందులో ఇప్పటి వరకు 3,333 బోరు బావులు మాత్రమే వేశారు. దీని ద్వారా 35,496 ఎకరాలను మాత్రమే సాగులోకి తీసుకురాగలిగారు. మరో 10,214 ఎకరాల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. ఆయా భూముల్లో 973కు పైగా బోరుబావులు ఇంకా వేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే పనులు పూర్తి చేసినట్లు చెబుతున్న వాటిల్లోనూ ఇప్పటి వరకు 30శాతానికి పైగా బోరుబావుల్లో బోరుమోటార్లను బిగిస్తే... కరెంటు సరఫరా ఇవ్వలేదు. కరెంటు సరఫరా ఇస్తే బోరుబావుల్లో మోటార్లను బిగించలేదు.

ఇందిర జలప్రభ పథకం తాజా నివేదికల ప్రకారం ఆయా క్లస్టర్ల పరిధిలో ఇంకా 360 బోరుబావులకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉన్నాయి. 2014లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ వ్యవహారంలో కదలిక లేదు. ఎస్సీలకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తున్నామంటూ గొప్పగా ప్రకటిస్తూ.. అక్కడక్కడ నామమాత్రంగా చేపడుతూ చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం దళితుల బీడుభూములకు ఉద్దేశించిన ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement