ఉద్యోగ భద్రత కోసం వినూత్న నిరసన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఉద్యోగ భద్రత కోసం కాంట్రాక్ట్ అధ్యాపకులు, పార్ట్‌టైం పీఈటీలు బుధవారం వినూత్న నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు నోటికి నల్లగుడ్డను ధరించి కలెక్టరేట్ వరకు మౌన ర్యాలీని నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రతను కల్పించాలని జేఏసీ నాయకులు ఎంఏ నవీన్‌కుమార్, చాంద్‌బాషా, రఫీవుద్దీన్, మల్లికార్జున, సోమేష్ కోరారు. రిలే నిరాహార దీక్షలో మత్తయ్య, వెంకటశివుడు, మోహన్, బాయ్యరెడ్డి, నరసింహులు కూర్చున్నారు.
సీఎం దిష్టిబొమ్మ దహనం
కాంట్రాక్ట్ అధ్యాపకులకు మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో కేవీఆర్ కళాశాల నుంచి రాజ్‌విహార్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ సీఎం చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మిల, జిల్లా కార్యదర్శి అలివేలు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్, రాజ్‌కుమార్ మాట్లాడారు.
మోకాళ్లపై నిలబడి..
తమను రెన్యువల్ చేయాలని పార్ట్‌టైం పీఈటీలు బుధవారం..వినూత్నంగా మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. వీరికి సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, రాధాకృష్ణ, ఆనంద్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు రంగమునినాయుడు, నక్కలమిట్ట శ్రీనివాస్ మద్దతు ప్రకటించారు. దీక్షల్లో పార్ట్‌టైం పీఈటీలు ఏ.షాఫైజల్, టి.వేణుగోపాల్‌రెడ్డి, వి.శివరామ్, ఎన్‌వీఆరుణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.