
బడ్జెట్‌లో వినూత్న సంక్షేమ కార్యక్రమాలు
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడి
గొర్రెల కాపరులు, ఫిషరీస్ అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ తొలిసారిగా భేటీ
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ లేని విధంగా యాదవులు, కురుమలు, మత్స్యకార్మికుల సంక్షేమంపై అసెంబ్లీ, సచివాలయం, సబ్ కమిటీలో చర్చించడం గొప్ప విషయమని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ తొలిసారి సమావేశమైందని, మరో 2 లేదా 3 సమావేశాలు నిర్వహించిన అనంతరం ఆయా వర్గాల అభివృద్ధిపై నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తామన్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారని అన్నారు. ముదిరాజ్‌లు, గంగపుత్రులు, బెస్తలు, తెలుగువారు, యాదవులు, కురుమలు తదితర ఉపకులాల సామాజిక సంక్షేమం కోసం బడ్జెట్లో వినూత్న కార్యక్రమాలు ప్రవేశ పెట్టే నిమిత్తం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించామ న్నారు. ఆయా కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు సొసైటీలో పేర్లు నమోదు చేసుకో వాలని, త్వరలోనే అధి కారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే విధంగా చర్యలు తీసుకుం టున్నామన్నారు. రాబోయే బడ్జెట్‌కు పలు మార్గదర్శకాలు, పలు ప్రతిపాదనలు పంపామన్నారు.
పావలా వడ్డీకే గొర్రెల కాపర్లకు రుణాలు: 1996లో గొర్రెకాపర్ల సొసైటీ ఏర్పాటైందని, ఎన్‌సీడీసీ నుంచి రుణం పొందటానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత పూచీ ఇవ్వనందున రుణం రాలేదన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్లగా వారు అంగీకరించడంతో రూ. 400 కోట్ల రుణం లభిం చిందన్నారు. దీనిపై 10.75% వడ్డీ ఉందని.. దీనిని పావలా వడ్డీకే అందించేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. పశువైద్యం కోసం 100 మొబైల్ వ్యాన్‌లను ఏప్రిల్ నుంచి ప్రారంభిం చనున్నట్లు తెలిపారు. చేపలకు సంబంధించి దళారీ వ్యవస్థపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. చేపల మార్కెట్ గురించి ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. గంగ పుత్రుల కు తొలి, ఇతరులకు రెండో ప్రాధాన్యమన్న సీఎం హామీపై ఈసారి బడ్జెట్‌లో పదిరెట్లు పెంచామని స్పందించారు.