ఇన్‌పుట్‌ ఇక్కట్లు | input problems of farmers | Sakshi
Sakshi News home page

ఇన్‌పుట్‌ ఇక్కట్లు

Published Mon, Apr 24 2017 12:27 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ఇన్‌పుట్‌ ఇక్కట్లు - Sakshi

ఇన్‌పుట్‌ ఇక్కట్లు

ఇప్పటికీ అందని 2014 ఇన్‌పుట్‌ సబ్సిడీ
కాళ్లరిగేలా తిరుగుతున్న 22 వేల మంది రైతులు
తప్పులతడకల జాబితాతో రూ.33 కోట్లు వెనక్కి?

 
అనంతపురం అగ్రికల్చర్‌ : పెట్టుబడి రాయితీ(ఇన్‌పుట్‌ సబ్సిడీ) పంపిణీ ప్రహసనంగా మారింది. 2014కు సంబంధించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ నేటికీ పూర్తి చేయకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. మూడేళ్లు కావస్తున్నా దాదాపు 22 వేల మంది రైతులు పరిహారం అందకపోవడంతో వారంతా కార్యాలయాల చట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

మిస్‌ మ్యాచింగ్‌తోనే సమస్య
వర్షాలు లేక ఖరీఫ్‌–2014లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.  వేరుశనగ, ఇతర పంటలకు సంబంధించి 5.72 లక్షల మంది రైతులకు రూ.559.68 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరైంది. అయితే ఈ పరిహారాన్ని ఆన్‌లైన్‌లో రైతుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం ప్రహసనంగా సాగుతోంది. పంట నష్టపోయిన రైతుల జాబితా తయారీకి గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు చేసిన పొరపాట్లు రైతులకు శాపంగా మారాయి. రైతు, తండ్రి పేరు, గ్రామం, పంట, సర్వే నంబరు, పట్టా నంబరు, బ్యాంకు అకౌంట్, ఆధార్‌ తదితర అన్ని వివరాలు ఒకటికి రెండుసార్లు రైతుల నుంచి సేకరించినా వాటిని అప్‌లోడ్‌ చేసే సమయంలో చేసిన తప్పిదాలు రైతులను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. దీంతో పేరు కరెక్టు ఉంటే బ్యాంకు అకౌంట్‌ నంబర్, లేదంటే ఆధార్‌ నంబర్‌, అదీ బాగుంటే పట్టా నంబర్‌, లేదంటే తండ్రి పేరు, అదీ కాదంటేæ ఇంటిపేరు... ఇలా ఒకటి కాదు రెండు కాదు మిస్‌ మ్యాచింగ్‌ జాబితాతో సతమతమవుతున్నారు. బ్యాంకులకు వెళ్లిన పరిహారం పెద్ద ఎత్తున మిస్‌మ్యాచింగ్‌ జాబితాలో నిలిచిపోవడంతో వాటిని సరి చేసుకునేందుకు ఏఓలు, మండల గ్రీవెన్స్‌లు, జిల్లా గ్రీవెన్స్, జేడీఏ కార్యాలయం, బ్యాంకులు... ఇలా అన్ని చోట్ల తిరిగి తిరిగి వేసారిపోతున్నారు.

రాజకీయ ఒత్తిళ్లు
అధికార పార్టీకి చెందిన మండలస్థాయి నేతలు తమ వారికే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని, మరో పార్టీకి సంబంధించిన వారికి ఇవ్వొద్దంటూ ఒత్తిళ్లు చేస్తుండటంతో పరిహారం పంపిణీకి బ్రేకులు పడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే పరిహారం కన్నా దాని కోసం తిరగడానికి , జిరాక్స్‌ పత్రాలకే డబ్బులు ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి నెలకొందరు కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు పరిహారం కోసం 20 నుంచి 30 సార్లు తిరిగారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు.

8 విడతల్లో రూ.505 కోట్లు విడుదల
జిల్లాకు మంజూరైన రూ.559.68 కోట్లలో 2015 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఎనిమిది విడతలుగా రూ.505.68 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదలైంది. మొదట్లో రూ.45 కోట్ల వరకు మిస్‌మ్యాచింగ్‌ జాబితాలో నిలిచిపోగా... గత రెండేళ్లుగా పదుల సార్లు తిరిగి కాళ్లావేళ్లా పడి జాబితాను సరి చేసుకోవడంతో ప్రస్తుతం అది రూ.6 కోట్లు చేరుకున్నట్లు సమాచారం. విడుదల చేసింది పోను ఇంకా రూ.54 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. తొమ్మిదో విడత కింద రూ.4 కోట్లు, పదో విడత కింద రూ.21 కోట్ల వరకు అవసరమని జిల్లా అధికారులు రెండు నెలల కిందటే ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని తెలుస్తోంది. అప్‌లోడ్‌ చేసిన జాబితా ప్రకారం తక్షణం రూ.25 కోట్లు కావాలని చెబుతున్నారు.  ప్రతిపాదించిన ప్రకారం ప్రభుత్వం నుంచి రూ.25 కోట్లు విడుదలైనా మిగతా రూ.33 కోట్లు వెనక్కివెళ్లడం ఖాయమంటున్నారు.

సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేస్తాం
సాంకేతిక సమస్యతోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఆలస్యమవుతోంది. రెండు, మూడు రోజుల్లో తొమ్మిది, పదో విడత ఇన్‌పుట్‌ సబ్సిడీ రిలీజ్‌ అవుతుంది. సాధ్యమైనంత త్వరగా రైతులందరికీ పంపిణీ చేస్తాం. ఈ మేరకు ఇన్‌పుట్‌ సెల్‌ అధికారులకు, ఏడీఏలు, ఏఓలకు ఆదేశాలు జారీ చేశాం.
శ్రీరామమూర్తి, జేడీఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement