- ఇన్‌పుట్ సబ్సిడీ జాబితా విడుదల
ఖరీఫ్–2016లో దెబ్బతిన్న వేరుశనగ, ఇతర పంటలకు సంబంధించి వ్యవసాయ శాఖ తయారు చేసిన పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ) జాబితా విడుదలైంది. పరిహారం కేటాయింపులో కనగానపల్లి మండలం అగ్రస్థానంలో ఉండగా.. హిందూపురం చివరిస్థానంలో నిలిచింది.
కనగానపల్లి టాప్.. హిందూపురం లాస్ట్
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్–2016లో దెబ్బతిన్న వేరుశనగ, ఇతర పంటలకు సంబంధించి వ్యవసాయ శాఖ తయారు చేసిన పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ) జాబితా విడుదలైంది. పరిహారం కేటాయింపులో కనగానపల్లి మండలం అగ్రస్థానంలో ఉండగా.. హిందూపురం చివరిస్థానంలో నిలిచింది. గత ఏడాది 7.63 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో 6.10 లక్షల హెక్టార్లలో వేరుశనగ, మరో 1.53 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు ఉన్నాయి. తీవ్ర వర్షాభావం వల్ల 90 శాతం పంటలు నిలువునా ఎండిపోయాయి. రైతులకు భారీ నష్టం వాటిల్లింది. దిగుబడులు దారుణంగా దెబ్బతిన్నట్లు పంట కోత ప్రయోగాల్లోనూ రుజువైంది. కరువు పరిస్థితుల అధ్యయనానికి ఈ ఏడాది జనవరిలో కేంద్ర కరువు బృందం జిల్లాలో పర్యటించింది. పంటలు దారుణంగా దెబ్బతినడంతో జిల్లా రైతులకు రూ.1,175 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని కలెక్టర్ కేంద్ర బృందానికి నివేదించారు. కేంద్రం తన వాటా పరిహారాన్ని మూడు నెలల కిందటే రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్‌తో ముడిపెట్టి ఇవ్వాలని భావించింది. దీనిపై అన్ని వైపుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో చివరకు వెనక్కి తగ్గింది. ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ వేర్వేరుగా ఇస్తామని ప్రకటించి.. ఎట్టకేలకు జాబితాలు విడుదల చేసింది. తుది పరిశీలన తర్వాత అన్ని రకాల పంటలు 7,17,235 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు పరిగణించి 6,25,053 మంది రైతులకు రూ.1,032.42 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ జాబితాలో కనగానపల్లి మండలంలో 17,683 మంది రైతులకు గానూ అత్యధికంగా రూ.37.80 కోట్లు కేటాయించారు. అత్యల్పంగా హిందూపురం మండలంలో 6,362 మంది రైతులకు రూ.4 కోట్లు కేటాయించారు.