అంతరాష్ట్ర దొంగ అరెస్టు
రాజోలు : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడిన మేడిచర్ల నాగభూషణాన్ని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ జీవీ కృష్ణారావు విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. మలికిపురం మండలం రామరాజులంక గ్రామానికి చెందిన నాగభూషణం జిల్లాలోని రాజోలు, నగరం, అమలాపురం, మలికిపురం, రావులపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నర్సాపురం, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో పలు చోరీలకు పాల్పడ్డాడు. కొన్ని కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. ఈ ఏడాది మార్చిలో జైలు నుంచి వచ్చిన అతడు మళ్లీ చోరీల బాట పట్టాడు. రాజోలు, మలికిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐదు సవర్ల బంగారం, రూ.10 వేల నగదు చోరీ చేశాడు. శివకోడులోని ఒక బ్రాందీషాపు వద్ద నాగభూషణాన్ని పోలీసులు పట్టుకుని రాజోలు కోర్టులో హాజరుపర్చారు. అమలాపురం డీఎస్పీ అంకయ్య పర్యవేక్షణలో సీఐ జీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో ఎస్సై లక్ష్మణరావు కేసు దర్యాప్తు చేశారు. కేసు పురోగతిని సాధించేందుకు కృషి చేసిన ట్రైనీ ఎస్సై అజయ్‌బాబు, సర్కిల్ క్రైం హెచ్‌సీ బొక్కా శ్రీనివాస్, పీసీలు డి.శివకుమార్, డి.రమేష్‌బాబు, ఎ.జయరామ్‌ను సీఐ అభినందించారు. వీరిని రివార్డులకు సిఫారసు చేస్తానన్నారు.