అమ్మా నాన్నా.. ఆలోచించండి | inter students..parents pressure | Sakshi
Sakshi News home page

అమ్మా నాన్నా.. ఆలోచించండి

Published Fri, Aug 26 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

అమ్మా నాన్నా.. ఆలోచించండి

అమ్మా నాన్నా.. ఆలోచించండి

– మార్కులు, ర్యాంకుల విధానంతో అసలుకే మోసం
– కన్నపేగుకు కడుపుకోతను మిగులుస్తున్న వైనం
– ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ వైఖరిని మార్చుకోవాలి
– కళాశాలలు, ఇంటి వాతావరణం మారాలన్న విద్యావేత్తలు


మార్కుల వేటలో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. తమ కళాశాల విద్యార్థి అగ్రస్థానంలో ఉండాలని కళాశాలలు, తమ బిడ్డను ఉన్నత స్థానంలో చూడాలని తల్లిదండ్రులు ఆశిస్తుండటమే ఇందుకు కారణం. కన్నవారి, కళాశాలల ఆశలు, ఆకాంక్షలను ఆందుకోలేక పోతున్నామని మార్కుల సాధనలో వెనుకబడుతున్నామనే ఆందోళనే విద్యార్థుల్లో ఒత్తిడి పెంచుతోంది. మానసిక సంఘర్షణకు లోనవుతన్న విద్యార్థులు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా గురువారం నారాయణ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న వై. ప్రణయ్‌రెడ్డి   రైలుకింద పడి బలన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలో గత రెండేళ్లలో నారాయణ విద్యా సంస్థల్లోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడారు. ఇతర కాలేజీలు, పాఠశాలలు కలుపుకొని ఈ సంఖ్య మొత్తం ఏడుకు చేరుకుంది.  
– కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు)


గ్రూపు కుదించారని..
నన్నూరులోని నారాయణ బాయ్స్‌ క్యాంపస్‌లో గతేడాది సెప్టెంబర్‌ నాలుగో తేదీన శ్రీకాంత్‌ అనే విద్యార్థి హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మరణించాడు. ఇతని గ్రూపును కుదించడంతో తోటి విద్యార్థుల ఎదుట తలెత్తుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు దూరమయ్యాడు.  


అధ్యాపకుడు కొట్టాడని..
2016 జూలైలో కర్నూలులోని బుధవార పేటకు చెందిన సందీప్‌ అనే విద్యార్థి ఆర్‌ఎంకే ప్లాజాలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో చదువుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విద్యార్థిని తరగతి గదిలోనే అధ్యాపకుడు కొట్టినట్లు సమాచారం. అంతేకాక సూటిపోటీ మాటలు కూడా కుంగదీయడంతో రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.     


ప్రై వేటు పాఠశాలలు, కళాశాలల చదువు దారేటో తెలియడం లేదు.  కార్పొరేట్‌ విద్యా సంస్థల మధ్య పోటీతో విద్యార్థులను విశాంత్రి లేకుండా పరుగులెత్తించి ఊపిరి తీస్తున్నారు. భవిష్యత్‌లో ప్రయోజకులవుతారో లేదో కానీ చదువు పూర్తి కాకుండానే ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు లోకాన్ని విడిచిపెట్టి పోతున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిలిస్తున్నారు. కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేకున్నా బలవంతంగా చదువు పేరుతో అధ్యాకుల వేధింపులు కొనసాగుతున్నాయి. సెల్లార్‌ లాంటి తరగతి గదుల్లో వందలాది మంది పిల్లలను కూర్చోబెట్టి చదువులు చెబుతుండడంతో గురువులు చేప్పే బోధనాభ్యాసం తికమక పెట్టి కొందరు ఆయోమంలో పడుతున్నారు. మరోవైపు తరగతిలో నలుగురి మధ్య మార్కుల పేరుతో విభజించి అధ్యాపకులు అవమాన పరుస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు కనీసం వయస్సును కూడా చూడకుండా బెత్తంతో కొడుతూ బర్రెల్లాగా వ్యవహరిస్తున్నారు. అవమాన పరుస్తున్నారు. దీనికి కుంగి, కషించి విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. నిబంధనలు పాటించని ప్రై వేట్‌ విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా నారాయణ, చైతన్య పాఠశాలల యాజమాన్యాలకు నేరుగా ప్రభుత్వంతోనే సంబంధాలు ఉండడంతో సర్కార్‌ అటువైపు చూడడం లేదు. ఏదో కంటితుడుపు చర్యగా అప్పటికప్పుడు కమిటీలు వేసి చేతులు దులుపుకొంటోంది. ఇప్పటి వరకు చాలా కమిటీలు ఆచరణలోకి వచ్చిన నివేదిక ఇచ్చినవి మాత్రం ఒక్కటి లేదు.  


తల్లిదండ్రుల్లో మార్పు రావాలి
– తమ పిల్లలను ఇంజనీరు, డాక్టర్‌ చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు రూ. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేటు విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారే కానీ ఎలా చదువు చెబుతున్నారో పరిశీలించడం లేదు.
–  వారానికో.. పది రోజులకే ఇంటికి ఫోన్‌ చేస్తేమార్కులు తక్కువచ్చాయి.. ఇలాగైతే ర్యాంకు ఎట్లా వస్తుందని కోపగించుకుంటున్నారే కానీ పిల్లలు ఎదుర్కొంటున్న కష్టాలను పట్టించుకోవడం లేదు.
– కళాశాలలో ఒత్తిడిని బరించలేక చదువు మానేస్తామని విద్యార్థులు చెబుతున్నా తల్లిదండ్రులు మాత్రం రూ. లక్షలు కట్టాం..ఎలాగైనా పూర్తి చేయాలని సూచిస్తున్నారే కానీ ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపలేకపోతున్నారు.
– కార్పొరేట్‌ కళాశాలలో చదివిన వారు మాత్రమే ఉన్నత ఉద్యోగాలు చేయడం లేదనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించడం లేదు.
– ప్రస్తుతం విద్యా సంస్థల్లో సాంస్కతిక, ఆటలు, పాటలు, ఇతర కార్యక్రమాలకు ప్రాధాన్యం లేదు. ఈ విషయాలపై తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాలను ప్రశ్నించడం లేదు.


పిల్లల అభిరుచిని గమనించాలి: చెన్నయ్య, ప్రిన్సిపాల్‌ టౌన్‌ మోడల్‌ జూనియర్‌ కళాశాల, కర్నూలు
తల్లిదండ్రుల ఆలోచన తీరు మారాలి. పిల్లల మనసత్వాన్ని కనుగొని కోర్సులు, కళాశాలల ఎంపిక చేసుకొనివ్వాలి. అంతేకాని పిల్లలకు ఇష్టం లేకునా తల్లిదండ్రుల కోరికలను పిల్లలపై రుద్ది సాధించాలని ఒత్తిడి చేస్తే అలాంటి పిల్లల తల్లిదండ్రులకు దూరమయ్యే ప్రమాదముంది.


యాజమాన్యాలు స్వేచ్ఛనివ్వాలి : వై.నరసింహులు, వీసీ, రాయలసీమ యూనివర్సిటీ
యాజమాన్యాలు విద్యార్థుల మనసును తెలుసుకొని బోధన చేయాలి. మార్కులు ర్యాంకులతో చదవాలని ఒత్తిడి చేయరాదు. విద్యార్థికి ఇష్టమైన సమయంలోనే చదవనివ్వాలి. వారికే పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. లేదంటే భవిష్యత్‌లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.   
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement