నౌకాదళ పండుగ నేటి నుంచే
ఐఎఫ్‌ఆర్‌కు సర్వాంగ సుందరంగా ముస్తాబైన విశాఖ సాగరతీరం
హాజరుకానున్న రాష్ట్రపతి,
ప్రధానమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘ప్రపంచ దేశాల నౌకాదళాలు... సముద్ర జలాల ద్వారా ఐక్యత’ అనే నినాదంతో విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన(ఐఎఫ్‌ఆర్)కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వేడుకలకు విశాఖపట్నం సాగరతీరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భారతదేశం రెండోసారి నిర్వహిస్తున్న ఐఎఫ్‌ఆర్‌లో దాదాపు 52 దేశాల నౌకాదళాలు పాల్గొననుండటం విశేషం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, త్రివిధ దళాధిపతులు, ఇతర ప్రముఖులు ఐఎఫ్‌ఆర్‌కు హాజరుకానున్నారు.
ఐఎఫ్‌ఆర్ షెడ్యూల్...
ఫిబ్రవరి 4: విశాఖపట్నం బీచ్‌రోడ్డులోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద సాయంత్రం 4 గంటలకు నివాళులు అర్పించడంతో ఐఎఫ్‌ఆర్‌ను లాంఛనంగా ప్రారంభిస్తారు. సీఎం చంద్రబాబు, నౌకాదళ అధిపతి ఆర్కే ధోవన్ తదితరులు పాల్గొంటారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో మారిటైమ్ ఎగ్జిబిషన్, ఐఎఫ్‌ఆర్ విలేజ్‌లను చంద్రబాబు ప్రారంభిస్తారు.
ఫిబ్రవరి 5: నేవల్ బేస్‌లోని ఐఎన్‌ఎస్ శాతవాహనలో ఐఎఫ్‌ఆర్-2016ను గవర్నర్ నరసింహన్ అధికారికంగా ప్రారంభిస్తారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రత్యేక విమానాల్లో విశాఖపట్నం చేరుకుంటారు.
ఫిబ్రవరి 6: ప్రధాని మోదీ భువనేశ్వర్ వెళతారు. త్రివిధ దళాల అధిపతి హోదాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారత నౌకాదళ సామర్థ్యాన్ని సమీక్షిస్తారు. ప్రత్యేక యుద్ధనౌకలో సముద్ర జలాల్లో ప్రయాణిస్తూ యుద్ధ నౌకలను పరిశీలిస్తారు. సాయంత్రం నేవీకి చెందిన సాముద్రిక ఆడిటోరియంలో నేవల్ బ్యాండ్ సంగీత విభావరి నిర్వహిస్తుంది. దేశ, విదేశీ నౌకాదళ ప్రతినిధులకు రాష్ట్రపతి గౌరవ విందు ఇస్తారు.
ఫిబ్రవరి 7: రాష్ట్రపతి ఢిల్లీకి తిరిగి వెళ్తారు. రెండు రోజుల అంతర్జాతీయ మారిటైమ్ సదస్సును రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు బీచ్‌రోడ్డులో నౌకాదళ విన్యాసాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. రాత్రి బీచ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో దేశ, విదేశీ ప్రతినిధులకు నౌకాదళ అధిపతి ఆర్కే ధోవన్ విందు ఇస్తారు. ఇందులో ప్రధాని కూడా పాల్గొంటారు.
ఫిబ్రవరి 8: ఐఎఫ్‌ఆర్ ముగింపు వేడుకలను నిర్వహిస్తారు.
ఆకట్టుకున్న పరేడ్, కార్నివాల్
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్)లో దేశ విదేశీ నౌకలే కాకుండా కళాకారులు కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. వీటి సన్నాహాల్లో భాగంగా బుధవారం సాయంత్రం బీచ్ రోడ్డులో నిర్వహించిన పరేడ్, కార్నివాల్ సందర్శకులకు కనువిందు చేశాయి. కార్నివాల్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు సంప్రదాయ చిహ్నాలతో పాల్గొన్నారు. ఉగ్రవాదుల ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఐఎఫ్‌ఆర్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.