టీడీపీ నేత ఇంటిపై ఐటీ దాడులు
రూ.కోట్ల పన్ను ఎగవేత?
తిరుపతి రూరల్ : వైఎస్‌ఆర్ జిల్లా రైల్వేకోడూరు టీడీపీ నాయకుడు, వర్ష గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత వర్ష విశ్వనాథనాయుడుకు చెందిన తిరుపతిలోని ఇళ్లు, కార్యాలయంపై సోమవారం ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ గుప్త ఆధ్వర్యంలో ఇన్వేస్టిగేషన్ సహాయ డెరైక్టర్ పర్యవేక్షణలో రాత్రి వరకు సోదాలు కనసాగాయి. తిరుపతి కేంద్రంగా వర్ష విశ్వనాథనాయుడు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్, జ్యూస్ ఫ్యాక్టరీలను నిర్వహిస్తున్నారు.
కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నా ఆదాయపు పన్ను శాఖకు మాత్రం నామమాత్రంగా పన్నులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భారీగా పన్ను ఎగవేసినట్లు సమాచారం. కాగా, విశ్వనాథనాయుడు స్వగృహం, కార్యాలయాలపై ఐటీ దాడుల నేపథ్యంలో కవరేజ్‌కు వెళ్లిన సాక్షి ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. దాడులు జరుగుతున్నంత సేపు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటికి సమీపంలో మోహరించడం చర్చనీయాంశంగా మారింది.