ఇది జాతీయ రహదారేనా?
పట్టించుకోని అధికారులు
రోడ్డుగుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌లు వెళ్లినా మారని జోగిపేట రోడ్డు దుస్థితి
జోగిపేట : జాతీయ రహదారి పక్కనే మురికినీరు నిలిచి బురదమయంగా మారినా పట్టించుకునే వారు కరవయ్యారు. నగర పంచాయతీగా ఉన్న జోగిపేటలో రోడ్డు ప్రక్కన అపరిశుభ్రత నెలకొనడం వల్ల పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ కమిటీ మొదటి గేటు పక్కనే అంతా బురదగా మారింది. ప్రతి ఆదివారం ఇక్కడ సంత జరుగుతుంది. అందోలు, పుల్కల్, రేగోడ్, అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, కౌడిపల్లి, హత్నూర మండలాల నుంచి రైతులు మార్కెట్‌కు వస్తుంటారు.
జోగిపేట, సంగారెడ్డి నాందేడ్ రోడ్డుపై నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, జిల్లా అధికారులు రెగ్యులర్‌గా వెళుతున్నా ప్రధాన రహదారి పక్కనే నిల్వ ఉన్న మురికినీటిని పట్టించుకోకపోవడం గమనార్హం. తహసీలుదారు కార్యాలయం పక్కనే నీరు నిలిచి అపరిశుభ్రంగా మారింది. పక్కనే చెత్తకుండీ ఉండడం, మూత్ర విసర్జన కూడా అక్కడే చేయడంతో దుర్గంధం వస్తుంది. కార్యాలయానికి కలెక్టర్, జేసీ, ఆర్డీఓ, వంటి అధికారులు వస్తున్నా అటువైపు చూడడంలేదని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు.
జోగిపేట జాతీయ రహదారిపై ఎక్కడికక్కడే నీరు నిలవడం, బురదమయంగా మారి అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. నగర పంచాయతీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు. పోస్టాఫీసు ముందు నుంచి ప్రతి రోజు వందలాది మంది విద్యార్థులు కాలినడకన పాఠశాలలు, కళాశాలలకు వెళుతుంటారు. ఒక్కసారి పెద్ద వర్షం పడితే కనీసం 10 రోజులకు పైగా నీరు అక్కడే నిలిచిపోతోంది. ద్విచక్రవాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. స్థానిక నర్సింగ్‌హోం ముందు గత రెండు సంవత్సరాలుగా రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తోంది ఈ రోడ్డుగుండా ఎంతో మంది కాలినడకన వెళతుంటారు. మురికినీరు రోడ్డుపై నిలవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డుపై ద్విచక్రవాహనంపై వెళితే అదుపుతప్పితే బురదలో పడే ప్రమాదం ఉంది.
మురికి నీటిని తొలగించాలి
జోగిపేటలోని ప్రధాన రహదారి పక్కనే నీరు నిల్వ ఉండటంతో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పోస్టాఫీసు ఎదుట వర్షాకాలం నీరు నిలిచిఉంటుంది. రోడ్డు పక్కన విద్యార్థులు వెళుతుంటే నీటిలో నుంచి వాహనాలు వెళ్లే సమయంలో ఆ నీరంతా వారి దుస్తులపై పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
నరేష్, ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు
మార్కెట్ గేట్ వద్ద బురదనీటిని తొలగించండి
వ్యవసాయ మార్కెట్ గేట్ వద్ద నుంచి రోడ్డు మీదంతా మురికినీరు నిలవడంతో అంతా బురదమయంగా మారింది. మార్కెట్‌కు రైతులు వచ్చినప్పుడు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆరు బయట కూడా కొందరు వ్యాపారం చేసుకుంటారు. బురదనీటి వల్ల క్రిమి, కీటకాలు వస్తున్నాయి. గడ్డిపెరగడంతో దోమలు వస్తున్నాయి.
రమేశ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు