అంబకండిలో నేలబావిని పరిశీలిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ
రేగిడి: అంబకండి గ్రామంలో కిడ్నీ వ్యాధుల వ్యాప్తికి తాగునీరే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. శుద్ధి జలాన్నే తాగాలని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ అబ్దుల్‌రజాక్ సూచించారు. గత నెల 29న ‘అంబకండిలో కిడ్నీ భూతం’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆర్‌డబ్ల్యూఎస్, వైద్యశాఖాధికారులు స్పందించారు. నేలబావులు, బోర్ల నీటిని పరీక్షించారు. రెండు బోర్ల నీటిలో ఫ్లోరైడ్ ఉందని గుర్తించారు. మిగిలిన ఏడు బోర్ల నీరు తాగవచ్చని సూచించారు. ప్రస్తుతం చెరువుల్లో ఎక్కువుగా ఉన్నందున గ్రామంలోని నాలుగు నేలబావుల్లో నీరు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు.
నేలబావుల నీటిని తాగొద్దన్నారు. సంతకవిటి మండలం కొండగూడెంలో రూ.49 కోట్లతో నిర్మించిన రక్షిత నీటి పథకం నుంచి గ్రామంలోని రక్షిత పథకానికి సరఫరా చేస్తున్న నీటిని తాగాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటిని తాగడం శ్రేయోదాయకమన్నారు. రక్షిత నీటి ట్యాంకులో పూర్తిస్థాయిలో క్లోరినేషన్ చేసి తాగునీటిని సరఫరా చేయాలని సర్పంచ్ ప్రతినిధి లావేటి వెంకటవేణుగోపాలనాయుడుకు సూచించారు. కార్యక్రమంలో జేఈ జి.శ్రీచరణ్, సైట్ ఇంజినీరు గట్టి చలపతి, పంచాయతీ కార్యదర్శి జోతిర్మయి, వీఆర్వో సన్నెందొర తదితరులు పాల్గొన్నారు.