పోలవరం ప్యాకేజీపై న్యాయ విచారణ జరిపించాలి
వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్
పోలవరం రూరల్ :
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. తొలి విడతలో ఖాళీ చేసిన 8 గ్రామాల ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలిసి శుక్రవారం సందర్శించారు. నిర్వాసితులకు సంఘీభావం ప్రకటించారు. మామిడిగొంది సర్పంచ్ బొరగం కన్నప్పరాజు తదితరులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు తీరు, పునరావాస కేంద్రాల్లో సమస్యలను నాగిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ 11 రోజులుగా నిర్వాసితులు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరించడం సరికాదన్నారు. నిర్వాసితుల సమస్యలను తెల్లం బాలరాజు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారన్నారు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకోవాలని వైఎస్ జగన్ ఆదేశించడంతో తాను ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. నిర్వాసితులు చెప్పిన సమస్యలన్నిటినీ పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళతానన్నారు. ఇక్కడి సమస్యలను వైఎస్ జగన్ అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించారని, నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు రైతు, ప్రజాసంఘాలతో కలిసి పోరాడతారని పేర్కొన్నారు. నిర్వాసితులకు అండగా ఉండేవారిపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ధర్మబద్ధంగా మానవత ధృక్పథంతో న్యాయం చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములు, ఇళ్లను త్యాగం చేస్తున్నవారిని ఉసురుపెట్టడం మంచిది కాదని హితవు పలికారు. నిర్వాసితుల సమస్యలపై శనివారం విజయవాడలో అఖిలపక్ష కమిటీ సమావేశం జరుగుతోందని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రైతు విభాగం ప్రాంతీయ కార్యదర్శి కె.త్రినాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.వెంకటరావు, తూర్పుగోదావరి జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు సిరిపురం శ్రీనివాసరావు, పోలవరం మండల కన్వీనర్ సుంకర వెంకటరెడ్డి ఉన్నారు.