సాక్షి, విశాఖ : ఓ పార్టీ గుర్తుపై గెలిచిన ఆ తర్వాత మరోపార్టీ మారినప్పుడు రాజీనామా చేయకపోవడం రాజకీయ వ్యభిచారం అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రత్యర్థులను రాజకీయంగా మట్టికరిపించేలా కార్యకర్తలు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖలో వైఎస్‌ఆర్ సీపీ శిక్షణా తరగతుల ప్రారంభం సందర్భంగా సజ‍్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ పనులు చూస్తే సాక్ష్యాలు లేకుండానే... చంద్రబాబుపై చర్యలు తీసుకోవచ్చన్నారు.
బాబు అవినీతే ఏపీ అభివృద్ధికి అవరోధం
ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి కారణంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం నిధులు సక్రమంగా రావడం లేదని, రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు అవినీతే అవరోధమని మండిపడ్డారు. విశాఖలో నిర్వహించిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన టీడీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ కాబినెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలకు బదులుగా భూసేకరణ గురించి మాత్రమే చర్చించారన్నారు.
అవినీతి చేయడం ఎలా అన్న అంశంపై ప్రస్తుతం లోకేష్‌కు ట్రైనింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మూడున్నరేళ్లలో ప్రభుత్వం రూ.2.26 లక్షల వేల కోట్లు అప్పు చేసిందన్నారు. ఏపీలో అవినీతి ఎక్కువ అని జపాన్ కంపెనీలు చెబుతున్నాయని తెలిపారు. గతంలో టీడీపీ 43 చోట్ల ఉప ఎన్నికల్లో ఓడిపోయిందని, అలాగే 23 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్‌ఆర్ సీపీదే అధికారమని అన్నారు. గతంలో వైఎస్‌ఆర్ ను విమర్శించినవారే ఆ తర్వాత ఆయనను దేవుడని కొనియాడారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment