
సాక్షి, ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌లో దుర్మార్గపు పాలన సాగుతోందని, సీఎం చంద్రబాబు అవినీతి వల్లే పోలవరం టెండర్లను కేంద్రం అడ్డుకుందని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇక్కడ ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపుల పేరుతో సీఎం చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించిన తర్వాతే శిల్పాచక్రపాణిరెడ్డిని వైఎస్ జగన్ తమ పార్టీలోకి ఆహ్వానించారని ఈ సందర్భంగా సజ్జల గుర్తుచేశారు. చంద్రబాబు పాలన మాఫియాకు అడ్డాగా మారిందని, ఆయన అవినీతి కారణంగానే పోలవరం ప్రాజెక్టులో జాప్యం ఏర్పడి ఏపీ ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.