ఉచిత ఇసుకతో వ్యాపారం చేస్తారా ?
ఉచిత ఇసుకతో వ్యాపారం చేస్తారా ?
Published Tue, Feb 21 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM
ఇసుక ర్యాంపులు నిలిపే అధికారం ఎవరిచ్చారు?
నేను ర్యాంపు తెరిపిస్తే అమాయక కూలీలపై అక్రమ కేసులా?
దమ్ముంటే నాపై పెట్టండి బేషరతుగా లొంగిపోతా
అధికారుల తీరుపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ధ్వజం
కొత్తపేట : ఓ వైపు సీఎం ఇసుక ఉచితం అని హామీ ఇస్తే మరో వైపు అధికారులు ఆ హామీని గాలికొదిలేసి అధికార పార్టీతో కుమ్మక్కై వ్యాపారం చేస్తారా? అని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. కొత్తపేట మండలం మందపల్లి ఇసుక ర్యాంపును మూసివేయగా జట్టు కూలీల ఫిర్యాదుపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ర్యాంపు తెరిపించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి వీఆర్వో ఫిర్యాదు మేరకు ఐదుగురు కూలీలపై కేసులు నమోదు చేశారు. ఈ చర్యపై జగ్గిరెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం సాయంత్రం కొత్తపేటలో రాష్ట్ర వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ జట్టు మేస్త్రీ కూడా కాని అధికార పార్టీ దళారికి కొమ్ము కాసి సుమారు 500 మంది కూలీలు కడుపు మాడ్చితే వారి ఆవేదన మేరకు తాను స్వయంగా వెళ్లి అక్కడి నుంచే అధికారులతో మాట్లాడి ర్యాంపు గేటు తీశానన్నారు. దానిని జీర్ణించుకోలేక సామాన్య కూలీలపై కేసులు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు.15 రోజుల్లో ఆ ర్యాంపులో «బాట నిర్వహణ సొమ్ము పేరుతో దళారి ద్వారా తహసీల్దార్ రూ.లక్షలు వెనకేసుకున్నారని ఆరోపించారు.ఈ రోజు కూలీలందరూ కలిసి దానిని ప్రశ్నిస్తే..సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే ర్యాంపు మూసివేశారు. ఆ వ్యక్తులపైనే కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ‘అసలు ర్యాంపు మూసేసే అధికారం ఆయనకెక్కడిది? ఉచిత ఇసుకకు తాళాలేమిటి? దళారిని పెట్టి కూలీల కష్టార్జితాన్ని దోచుకోవడమేమిటి? తాళం తీసింది నేను..దమ్ము ధైర్యం వుంటే నాపై కేసులు పెట్టండి? భేషరతుగా లొంగిపోవడానికి సిద్ధంగా వున్నానంటూ’ సవాల్ విసిరారు. ర్యాంపు తీయకపోయినా.. అక్రమ కేసులు తొలగించకపోయినా, సమగ్ర విచారణ జరపాలి. లేకుంటే రెవెన్యూ కార్యాలయాన్ని, పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని జగ్గిరెడ్డి హెచ్చరించారు. గతంలో ఈ తహసీల్దార్ అనధికార ఫైర్ లైసెన్స్‌ల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారని దానిపై చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ దళారులతో కలిసి అవినీతికి అడ్డాగా మారారని తహశీల్దార్ తీరుపై జగ్గిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు.బాటా పేరుతో వసూలు చేసిన సొమ్ము కూలీలందరికీ చెందాలని, ఆ సొమ్ముకు లెక్కలు చెప్పాలని తహసీల్దార్‌ను జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు బండారు కృష్ణమూర్తి, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి కముజు సత్యనారాయణమూర్తి, గ్రామ పార్టీ అధ్యక్షుడు పేపకాయల బ్రహ్మానందం, మండల న్యాయ విభాగం కన్వీనర్ చావలి సుబ్బరాయశాస్త్రి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మాకే నరసింహమూర్తి, జిల్లా ఎస్సీ విభాగం సభ్యుడు కొంబత్తుల రామారావు, పార్టీ వివిధ విభాగాల నాయకులు దంగేటి సుబ్రహ్మణ్యం(డీఎస్), సలాది బ్రహ్మాజీ, యర్రంశెట్టి నాయుడు, ధర్నాల వెంకటేశ్వరరావు, మహ్మద్ హరుణ్ పాల్గొన్నారు.
Advertisement