రేవు రేవునా.. కాసుల పంట
రేవు రేవునా.. కాసుల పంట
Published Sat, Apr 22 2017 11:41 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM
- ఉచిత ఇసుకలో దండిగా దండుకుంటున్న ‘తమ్ముళ్లు’
- గాల్లో కలుస్తున్న నిబంధనలు
- గుల్లవుతున్న నదులు
- రెట్టింపు రేట్లకు అమ్మకాలు
ఆశకు హద్దే లేదన్నట్టుగా చెలరేగిపోతున్నారు ‘తమ్ముళ్లు’. ‘ఉచితం’ ముసుగులో ప్రజల కళ్లల్లో ‘ఇసుక’ కొడుతున్నారు. జిల్లాలోని గోదావరి, ఏలేరు, తాండవ నదులను ఇష్టానుసారం గుల్ల చేసేస్తూ.. నిబంధనలను తుంగలో తొక్కుతూ.. అనధికార ర్యాంపులు నిర్వహిస్తూ.. వేల లారీల ఇసుకను అక్రమంగా తరలించేస్తూ.. రేవురేవునా కాసుల పంట పండించుకుంటున్నారు. అధికారం అండతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. కళ్లముందే ఇదంతా జరుగుతున్నా అధికారులు ఏ కారణంచేతనో మిన్నకుండిపోతున్నారు. ఫలితంగా.. చంద్రబాబు ప్రభుత్వం ఇసుక ఉచితమని గొప్పగా ప్రకటించినా.. బండెడు ఇసుక పొందడం కూడా జనానికి భారంగా మారిపోయింది. గతంలో ఇచ్చుకున్నట్టుగానే.. ఇప్పుడూ సొమ్ములు వదిలిపోతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు.
అమలాపురం : ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం లోపభూయిష్టంగా మారింది. ఈ పథకం అమలు అడుగడుగునా అభాసుపాలవుతోంది. ఇసుక ఎగుమతి, బాట నిర్వహణకు ప్రభుత్వం విధించిన దానికన్నా రెట్టింపు ధరలు వసూలు చేయడంతో సామాన్యులకు ఉచిత ఇసుక భారంగా మారింది. ఉచిత ఇసుక ముసుగులో జిల్లాలో గోదావరితోపాటు, ఏలేరు, తాండవ నదులను కూడా ఇసుకాసురులు గుల్ల చేసేస్తున్నారు. ప్రతి ర్యాంపులోనూ అధికార టీడీపీకి చెందిన నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధులు పెత్తనం చేస్తూ దొరికినకాడికి దోచేస్తున్నారు.
దోచేస్తున్నారిలా..
- జిల్లాలో గతంలో 38 రీచ్‌లు ఉండేవి. వీటిలో ప్రస్తుతం నాలుగు పని చేయడం లేదు. మరో 13 రీచ్‌లకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. దీంతో జిల్లాలోని 21 ఇసుక ర్యాంపుల ద్వారా ప్రభుత్వం ప్రస్తుతం ఉచిత ఇసుక అందిస్తోంది. వీటిల్లో 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతి మంజూరు చేయగా, ఇప్పటివరకూ 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు జరిగాయి.
- జిల్లాలో ఇసుక ర్యాంపుల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది కపిలేశ్వరపురం మండలమే. ఇక్కడ నాలుగు ర్యాంపులుండగా, రోజుకు 500 లారీల ఇసుక ఎగుమతి జరుగుతోంది. ర్యాంపులో మూడు యూనిట్ల ధర రూ.900 అని బోర్డు పెట్టినప్పటికీ, రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ అమ్ముతున్నారు.
- 16వ నంబర్ జాతీయ రహదారికి 4 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో తాతపూడి ర్యాంపునకు, నాణ్యత బాగుంటుందన్న కారణంగా కోరుమిల్లి ర్యాంపునకు అధిక సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. ఆయా ర్యాంపుల నుంచి రోజుకు 500 పైగా లారీల ఇసుక తరలిపోతోంది.
- రాజమహేంద్రవరం కుమారి టాకీస్ ఇసుక ర్యాంపు వద్ద రెండు యూనిట్ల ఇసుకను రూ.1,750కి అమ్ముతున్నారు. ఇక్కడినుంచి నగరంలోకి రవాణాకు రూ.500 వరకూ ఖర్చవుతోంది. కొంతమంది లారీ యజమానులు క్వారీ సెంటర్ మార్కెట్ యార్డు సమీపంలో డంప్ చేసి, అక్కడి నుంచి రెట్టింపు రేట్లకు కాకినాడ, తునికి రవాణా చేస్తున్నారు.
- రాజమహేంద్రవరం రూరల్ వేమగిరి వద్ద ఇసుక ర్యాంపుల్లో ఉచితంగా ఇస్తున్న ఇసుకకు ఎగుమతి, బాట చార్జీల పేరుతో బాదేస్తున్నారు. యూనిట్‌కు అదనంగా రూ.400 నుంచి రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు.
- కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేయపురం, అంకంపాలెం, జొన్నాడ, మందపల్లి ర్యాంపుల్లో యూనిట్‌కు రూ.350 వసూలు చేయాల్సి ఉండగా రూ.200 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక్కడినుంచి ఒక్కో ర్యాంపు నుంచి 300 నుంచి 500 యూనిట్ల ఇసుక రవాణా జరుగుతోంది. ఒక్కో ర్యాంపువద్ద రోజుకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు దోపిడీ జరుగుతోంది.
- తుని నియోజకవర్గ పరిధిలో తాండవ నదిలో ఉచిత ఇసుక అడుగడుగునా అభాసుపాలవుతోంది. టీడీపీకి చెందిన రాష్ట్రస్థాయి నేత సోదరుని ఆధ్వర్యాన ఇక్కడ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. రోజుకు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల విలువైన ఇసుక తరలిపోతోంది. లారీకి రూ.2 వేలు, ట్రాక్టర్‌కు రూ.500, ఎడ్లబండికి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. దీనికి రవాణా అదనం కావడంతో నిర్మాణదారులకు ప్రభుత్వ ఉచిత ఇసుక భారంగానే ఉంది.
Advertisement