జలం.. జటిలం
జలం.. జటిలం
Published Sun, Sep 18 2016 1:44 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
చింతలపూడి : జిల్లాలోని మెట్ట ప్రాంత జలాశయాలు, చెరువులు నీరు లేక వెలవెలబోతున్నాయి. తమ్మిలేరు, ఎర్ర కాలువ, నందమూరి విద్యాసాగర్ ప్రాజెక్టులు దాదాపుగా అడుగంటాయి. పూర్తిగా వర్షాధారమైన ఈ ప్రాజెక్టులు సరైన వర్షాలు పడకపోవడంతో కళ తప్పాయి. దీంతో రైతులు సాగునీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది మెట్ట ప్రాంతంలోని రైతుల పరిస్థితి. చుట్టూ చెరువులున్నా సాగు నీటికి, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో గోదావరి నది ప్రవహిస్తున్నా వినియోగించుకునే అవకాశం రైతులకు కలగడం లేదు. దీంతో జిల్లాలో వర్షాలపై ఆధారపడిన చెరువులు, ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. మెట్ట ప్రాంతంలో ప్రధానమైన తమ్మిలేరు, ఎర్రకాలువ, నందమూరి విద్యాసాగర్ జలాశయాలు నీరు లేక గతేడాది పూర్తిగా అడుగంటిపోయాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వేసవిలో చెరువులు ఎండిపోగా, బోర్లు సుమారు 20 మీటర్లకు పైగా నీటి మట్టం పడిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో కూడా మెట్ట ప్రాంతంలో సరైన వర్షాలు పడక పోవడంతో చెరువులు నిండలేదు. నీరు–చెట్టు పథకంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పూడిక తీత పనులు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. చెరువుల ఆక్రమణలు తొలగించకుండా కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేయడం వల్ల వర్షపు నీరు నిల్వ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో 100 ఎకరాలకు పైబడిన చెరువులు సుమారు 450 వరకు ఉన్నాయి. ఇవి కాక వంద ఎకరాల లోపు చెరువులు, కుంటలు కలిపి దాదాపు 3,100 వరకు ఉంటాయి. ఈ చెరువుల విస్తీర్ణం సుమారు 1.80 లక్షల ఎకరాల్లో ఉంది.
అడుగంటిన తమ్మిలేరు
పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 15 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న తమ్మిలేరు రిజర్వాయర్ ప్రస్తుతం అడుగంటింది. రాష్ట్ర విభజన తరువాత జలాశయానికి ఎగువ ప్రాంతం ఖమ్మం జిల్లా నుంచి వచ్చే నీటిని అక్కడి రైతులు ఇసుక బస్తాలు వేసి అడ్డుకున్నారు. దీంతో మెట్ట రైతుల కల్పతరువు తమ్మిలేరు రిజర్వాయర్ ఈ ఏడాది పూర్తిగా నిండలేదు. ముందు ముందు తమ్మిలేరు భవిష్యత్తు ఏంటని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద 1969లో ప్రభుత్వం తమ్మిలేరు ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 355 అడుగులు కాగా ,ప్రస్తుతం 331 అడుగుల నీటిమట్టం ఉంది. కనీసం 340 అడుగుల నీరు ఉంటేనే కానీ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసే అవకాశం లేదు. గత దశాబ్ద కాలంలో ఇంత దారుణమైన పరిస్థితి తమ్మిలేరుకు ఎదురు కాలేదని రైతులు వాపోతున్నారు.
ఆదుకోని నీరు–చెట్టు
గతేడాది జిల్లాలో సుమారు 408 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు. సుమారు రూ.47 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది 374 చెరువుల్లో పూడికతీతకు ప్రభుత్వం రూ. 69 కోట్లు మంజూరు చేసింది. అయితే చెరువుల్లో ఆక్రమణలు తొలగించకుండా పనులు తూతూమంత్రంగా చేసి మమ అనిపించారు. గతేడాది పనుల కంటే అధ్వానంగా చేశారు. నీరు–చెట్టు పథకంలో చెరువుల్లో పూడికతీసి భూగర్భ జలాలను పెంపొందించాలని భావించిన లక్ష్యం పూర్తవలేదు.
ఆక్రమణలు తొలగించమని కోరాం
చెరువులను సర్వే చేసి ఆక్రమణలు తొలగించమని రెవెన్యూ శాఖాధికారులను గతంలోనే కోరాం. అయితే ఆ విధంగా చర్యలు లేవు. భారీ వర్షాలు కురిస్తే చెరువుల్లోకి నీరు చేరుతుంది. చెరువు పల్లాలను ఆక్రమించుకుని ఎవరైనా పంటలు వేసుకుంటే మునిగిపోవడం ఖాయం.
– యు.పరమానందం, ఇరిగేషన్ ఏఈ
Advertisement
Advertisement