జనసంద్రం | jana sandram | Sakshi
Sakshi News home page

జనసంద్రం

Published Sun, Jan 29 2017 11:44 PM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

జనసంద్రం - Sakshi

జనసంద్రం

కిక్కిరిసిన ద్వారకాతిరుమల
 అన్ని దారులు వెంకన్న సన్నిధికే..
 చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌
 కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటిన ప్రజలు
 
 
’రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతోంది. అసమర్థ పాలన నడుస్తోంది. అసత్య పాలన సాగుతోంది. అప్రజాస్వామిక పాలన కొనసాగుతోంది. రాష్టాన్ని చతుర్ముఖ దుష్టపాలన ఏలుతోంది. మేధావులూ ఆలోచించండి. యువకులూ కదలండి. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం...’ అంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ద్వారకాతిరుమల చినవెంకన్న సన్నిధిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు సర్కారు తీరుపై వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. వెల్లువలా తరలివచ్చిన ప్రజలు మీ వెంటే మేమంటూ నినదించారు. సభా ప్రాంగణంలో కొవ్వొత్తులు వెలిగించి.. ప్రత్యేక హోదా ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు.
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
ద్వారకాతిరుమల జనసంద్రంగా మారింది. జిల్లాలోని అన్ని దారులూ ద్వారకాతిరుమల వైపే మళ్లాయి. తమ అభిమాన నేతను చూసేందుకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి సభాస్థలికి చేరుకోకముందే సభా ప్రాంగణమంతా నిండిపోగా, వేలాది మంది బయట నిలబడిపోయారు. ఇంత జనసందోహాన్ని తాము ఎప్పుడూ చూడలేదని ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న సందర్భంగా ద్వారకాతిరుమలలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కనిపించిన దృశ్యాలివి. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయడానికి పూనుకున్న ప్రభుత్వం.. విశాఖలో శాంతియుతంగా నిర్వహించ తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీకి కూడా ప్రతిపక్ష నేతను అనుమతించకుండా విమానాశ్రయంలోనే అడ్డుకున్న తర్వాత జరిగిన సభ కావడంతో ఆ ఆగ్రహం ప్రజల్లో ఏ స్థాయిలో ఉందో ఈ సభకు వచ్చిన జనసందోహాన్ని చూస్తే అర్థమైంది. సభా ప్రాంగణంలో ప్రత్యేక హోదా నినాదం ప్రతిధ్వనించింది. జిల్లా రాజకీయాలను శాసించిన కోటగిరి విద్యాధరరావు తనయుడు శ్రీధర్‌ పార్టీలో చేరుతుండటంతో లో కొత్త ఊపునిచ్చింది. తొలుత హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌మోహనరెడ్డికి జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆయన తణుకు మండలం తేతలి సెంటర్‌లో ఆగారు. అక్కడ వైఎస్‌ జగన్‌ సమక్షంలో 25 మంది వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి వైఎస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉంగుటూరు మండలం నారాయణపురం సెంటర్‌లో పుప్పాల వాసుబాబు నేతృత్వంలో వైఎస్సార్‌ సీపీ అభిమానులు, కార్యకర్తలు వైఎస్‌ జగన్‌కు పెద్దఎత్తున స్వాగతం పలికారు. భీమడోలు రైల్వేగేటు సెంటర్, భీమడోలు సెంటర్‌ వద్ద కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున రోడ్లపైకి చేరుకుని జగన్‌కు నీరాజనాలు పలికారు. పంగిడి గూడెం సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి, సూర్యచంద్రరావుపేటలో వైఎస్సార్‌ విగ్రహానికి జగన్‌ పూలమాల వేసి నివాళుల్పరించారు. తిమ్మాపురంలో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని ప్రతిపక్ష నేత ఆవిష్కరించారు. అనంతరం ద్వారకాతిరుమలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ’దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే చంద్రబాబు పాలనలో ఏపీ అవినీతిలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. ఈ విషయాన్ని ఎన్‌సీఏఈఎన్‌ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇలాంటి అవినీతి పాలన నడుస్తోంది. ఎమ్మార్వోను నడిరోడ్డుపై జుట్టుపట్టుకుని ఈడ్చుకెళితే ఏమీ చేయలేని.. యువతుల హత్యల వెనుక టీడీపీ నేతలున్నా పట్టించుకోని అసమర్థ పాలన నడుస్తోంది.. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని.. ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామని నమ్మించి మోసగించే అసత్య పాలన నడుస్తోంది. ప్రత్యేక హోదా కోసం గాంధేయ పద్ధతిలో కొవ్వొత్తుల ప్రదర్శన చేయడానికి వెళితే అడ్డుకునే అప్రజాస్వామిక పాలన నడుస్తోంది. రాష్టాన్ని చతుర్ముఖ దుష్టపాలన ఏలుతోంది. మేధావులూ ఆలోచించండి. యువకులూ కదలండి. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం...’ అంటూ పిలుపునిచ్చారు. వెల్లువలా తరలివచ్చిన ప్రజలు మీ వెంటే మేమంటూ నినదించారు. సభా ప్రాంగణంలో కొవ్వొత్తులు వెలిగించి.. ప్రత్యేక హోదా ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు. సభానంతరం వైఎస్‌ జగన్‌ చిన్నవెంకన్నను దర్శించుకున్నారు. అక్కడ ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం లభించింది.
 
ఏలూరులోనే ఉంటా..
వైఎస్సార్‌ సీపీలో చేరిన అనంతరం కోటగిరి శ్రీధర్‌ మాట్లాడుతూ తమ కుటుంబంలో ప్రతి శుభకార్యం ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో జరిగిందని, అందుకే తానే చేరే కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాలని కోరామన్నారు. ఇక్కడికి వచ్చిన వైఎస్‌ జగన్‌కు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, కోటగిరి విద్యాధరరావు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. 12 ఏళ్లపాటు తన తండ్రితో పని చేశానని, ఏలూరులోనే నివాసం ఉంటానని, అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. 
 
ఎంఆర్‌డీ బలరామ్‌ చేరిక
కోటగిరి శ్రీధర్‌తోపాటు ఏలూరుకు చెందిన ఎంఆర్‌డీ బలరామ్‌ కూడావైఎస్సార్‌ సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురామ్, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మేకా శేషుబాబు, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు, పార్టీ జిల్లా అద్యక్షుడు ఆళ్ల నాని, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వంకా రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, కొట్టు సత్యనారాయణ, గ్రంధి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, తానేటి వనిత, పాతపాటి సర్రాజు, ఘంటా మురళీ రామకృష్ణ, నియోజకవర్గ సమన్వయకర్తలు తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, కొఠారు రామచంద్రరావు, కవురు శ్రీనివాస్, దయాల నవీన్‌బాబు, దూలం నాగేశ్వరరావు, గుణ్ణం నాగబాబు, పార్టీ నేతలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, చీర్ల రాధయ్య, కృష్ణ శ్రీనివాస్, బొద్దాని శ్రీనివాస్, ఘంటా ప్రసాదరావు, సుధీర్‌బాబు, గుడిదేశి శ్రీనివాస్, వందనపు సాయిబాలపద్మ, చెలికాని రాజబాబు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement