ఉపాధి లక్ష్యంగా నైపుణ్యాల శిక్షణ
ఉపాధి లక్ష్యంగా నైపుణ్యాల శిక్షణ
Published Thu, Jun 15 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM
జాయింట్ కలెక్టర్ మల్లికార్జున
వికాస, టీసీఎస్ సంస్థలతో సమీక్ష
కాకినాడ సిటీ : వికాస, టాటా కన్సెటెన్సీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జిల్లాలోని మూడువేల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను అందించే నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామని జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. గురువారం జేసీ తన చాంబర్‌లో వికాస, టీసీఎస్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎఫర్మేటీవ్ యాక్షన్ ప్రోగ్రామ్ కింద జిల్లాలోని నిరుద్యోగ యువతకు బిజినెస్ ప్రోమోషన్ సర్వీసెస్ శిక్షణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి అవకాశాలను అందుకునేందుకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్, యాటిట్యూడ్ డెవలెప్‌మెంట్, అనలిటికల్, లాజికల్ రీజనింగ్ వంటి అంశాల్లో జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇందుకు జిల్లాలో 10 శిక్షణా కేంద్రాలను వికాస ద్వారా ఏర్పాటు చేసి, టీసీఎస్ నిపుణుల సహకారంతో శిక్షణ నిర్వహిస్తారన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు నెల రోజుల పాటు శిక్షణ కల్పిస్తారని, శిక్షణ అనంతరం 10 నుంచి 20 శాతం ప్రతిభావంతులైన అభ్యర్థులకు టీఏసీఎస్ నియామకాలు కల్పిస్తుందని, మిగి లిన వారికి వికాస ద్వారా ఇతర సంస్థల్లో ఉపాధి అవకాశాలను అన్వేషించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే సిద్ధమైన కాకినాడ, తుని కేంద్రాలలో జూలై 3 నుంచి తొలి బ్యాచ్ శిక్షణ ప్రారంభం కానుందన్నారు. త్వరలోనే సామర్లకోట, రంపచోడవరం, అమలాపురంలలో కూడా ఈ కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రతి బ్యాచ్‌లో 50 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయిస్తారన్నారు. 2016–17 సంవత్సరాల్లో పాసైన గాడ్యుయేట్లు మాత్రమే అర్హులని, అంతకు ముందు పాసైన వారు, కరస్పాండెన్స్ కోర్టులు చేసిన వారు అర్హులు కారన్నారు. ఈ కార్యక్రమంలో వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ వీఎన్ రావు, టీసీఎస్ కన్సల్టెంట్ సరస్వతి పద్మనాభన్ పాల్గొన్నారు.
కొబ్బరితాళ్లు, తేనెటీగల పెంపకం యూనిట్లు
ప్రధాన మంత్రి ఉపాధికల్పన కింద నాబార్డు సహకారంతో స్వయం సహాయ బృందాల మహిళలకు కొబ్బరి తాళ్ల యూనిట్లు, తేనెటీగల పెంపకం యూనిట్లు మంజూరు చేయనున్నామని జేసీ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో పరిశ్రమలు, డీఆర్‌డీఏ, బ్యాంకర్లు, నాబార్డు అధికారులతో సమావేశం నిర్వహించి ఉపాధి యూనిట్ల మంజూరుపై సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఎల్‌డీఎం సుబ్రహ్మణ్యం, నాబార్డు ఏజీఎం ప్రసాద్, పరిశ్రమల శాఖ డీడీ శ్రీపతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement