త్వరగా భూసేకరణ
త్వరగా భూసేకరణ
Published Wed, Dec 14 2016 10:08 PM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
సమీక్ష సమావేశంలో జేసీ సూచన
కాకినాడ సిటీ : జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి ఏలేరు ఆధునికీకరణ, ఏడీబీ రోడ్డు విస్తరణ తదితర భూసేకరణ పనులపై ఆయన సమీక్షించారు. ఏలేరు పరిధిలో భూసేకరణకు 12 గ్రామాలకు ప్రిలిమినరీ నోటిఫకేషన్ విడుదల చేసినందున రైతులతో సమావేశాలు జరిపి ఈనెల 18వ తేదీ నాటికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కిర్లంపూడిలోని నాలుగు గ్రామాలకు సంబంధించి మార్పుల ప్రతిపాదనలను తక్షణం ఇవ్వాలని ఇంజనీర్లను ఆదేశించారు. జనవరి నెలాఖరు నాటికి ఏలేరు ఆధునికీకరణకు భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఆర్డీవోలకు సూచించారు. సామర్లకోట–రాజానగరం ఏడీబీ రోడ్డుకు సంబంధించి ఈనెల 20వ తేదీ నాటికి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీచేయాలని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌కు సూచించారు. రంగంపేటలోని 13 గ్రామాలకు గానూ 7 గ్రామాలకు ప్రిలిమినరీæ నోటిఫికేషన్ జారీచేశామని, మిగిలిన ఆరు గ్రామాలకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో కాకినాడ, పెద్దాపురం ఆర్‌డీఓలు బీఆర్ అంబేడ్కర్, విశ్వేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
సీసీఎల్‌ఏ వీడియో కాన్ఫరెన్స్
జిల్లాలో ప్రజాసాధికార సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. బుధవారం రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్ర పునేటా నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ కలెక్టరేట్ నుంచి పాల్గొని సర్వే పురోగతి, చేపట్టిన చర్యలను వివరించారు. సీసీఎల్‌ఏ మాట్లాడుతూ సర్వేకు సంబంధించి ఎటపాక, చింతూరు మండలాల్లో ప్రగతి మందకొడిగా ఉందని వేగంగా చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై సమీక్షించి ఆదేశాలు జారీచేశారు. సమావేశంలో కలెక్టరేట్ ఏవో తేజేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement