యథేచ్ఛగా జెల్లీ ఫిష్‌ వేట | jelly fish hunting | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా జెల్లీ ఫిష్‌ వేట

Published Wed, Jun 7 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

యథేచ్ఛగా జెల్లీ ఫిష్‌ వేట

యథేచ్ఛగా జెల్లీ ఫిష్‌ వేట

తుస్సుమంటున్న చేపల వేట నిషేధం
మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు
జీవనోపాధి లేక.. అంటున్న మత్స్యకారులు
ఇప్పటికీ అందని నష్టపరిహారం 
 
ఒక పక్క సముద్రంలో చేపల వేట నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని అధికారులు చెబుతుంటే.. మరో పక్క జెల్లీ షిష్‌ వేట యథేచ్ఛగా సాగుతోంది. వేట నిషేధానికి ముందే నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించనందున.. జీవనోపాధికి మరో దారి లేక జెల్లీ షిష్‌ వేట సాగుతోందని పలువురు మత్స్యకారులు అంటున్నారు. ఏప్రిల్‌ 15 నుంచి జూలై 15 వరకు చేపల వేట నిషేధం అమల్లో ఉంది. ఇంతవరకూ మత్స్యకారులకు ఒక్క పైసా కూడా నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించలేదు. జెల్లీ షిష్‌ వేట విషయం నిజమేనని అధికారులూ అంగీకరిస్తున్నారు.
 
కాట్రేనికోన (ముమ్మిడివరం) : సముద్ర జలాలలో మత్స్య సంపద ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు 61 రోజులు చేపల వేటపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన అధికారులు దళారులతో చేతులు కలపడంతో జెల్లీ ఫిష్‌ (రోఫిలిమా ఇస్యూలెంటమ్‌) వ్యాపారం జోరుగా సాగుతోంది.
నెలవారీ మామూళ్లతో కాకినాడ కేంద్రంగా జెల్లీ ఫిష్‌ ఎక్స్‌పోర్టు భారీగా సాగుతోంది. మత్స్యకారులు వేటాడి తెచ్చిన జెల్లీ ఫిష్‌లను సిమెంట్‌ కుండీలు, తార్పాలతో కట్టిన మడులలో ఉప్పు వేసి ఊరబెట్టి టన్నులు చొప్పున ఎగుమతి చేస్తున్నారు.
చేపల వేట నిషేధం ఎందుకు? 
మత్స్య సంపద పునరుత్పత్తి కాలంలో చేపల వేట, పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు, చమురు సంస్థలతో సముద్ర జలాలు కలుషితమై గుడ్లు పెట్టేందుకు విఘాతం కలుగుతుంది. మత్స్యసంపద అభివృద్ధి కోసం చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలం (నిషేధ సమయం)లో చేపలను వేటాడితే ఏపీ సముద్ర జల మత్స్య (క్రమబద్దీకరణ) చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిఉంది. మత్స్య శాఖ, కోస్టల్, మెరైన్, ఎన్‌పోర్సుమెంట్‌ విభాగాలు సంయుక్తంగా పని చేసి నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిఉంది. 
పలు గ్రామాల్లో యథేచ్ఛగా వేట...
ఉప్పాడ, కోనపాపపేట, భైరవపాలెం, దరియాలతిప్ప, కొత్తపాలెం, బలుసుతిప్ప తదితర ప్రాంతాలో భారీ ఎత్తున జెల్లీ ఫిష్‌లను సేకరించి ఎగుమతులు చేస్తున్నారు. సుమారు 30 కేజీల బరువు ఉన్న జెల్లీ ఫిష్‌ రూ.1,800ల నుంచి రూ.2,500లకు ధర పలుకుతుంది. నీటిలో తేలియాడుతూ జీవించే జెల్లీ.. మే, జూన్‌ నెలలో అధికంగా వస్తుంది. ధర అధికంగా ఉండడంతో మత్స్యకారులు వేట నిషేధాన్ని లెక్క చేయడం లేదు. 
చక్రం తిప్పుతున్న హోం గార్డు!
చేపల వేటను నియంత్రించాల్సిన అధికారులు నెలవారీ మామూళ్లతో నిద్ర మత్తులో జోగుతున్నారు. జెల్లీ ఫిష్‌ వ్యాపారులు, మత్స్యకారులను భయపెట్టి భారీ మొత్తంలో సొమ్ము వసూలు చేయడంలో ఒక హోం గార్డు చక్రం తిప్పాడనే ఆరోపణలు ఉన్నాయి.
జెల్లీ ఫిష్‌కు మంచి డిమాండ్‌ 
జెల్లీ ఫిష్‌ను చైనా, థాయిలాండ్, జపాన్, మలేషియా, ఇండోనేషియా, కొరియా తదితర దేశాలలో ఆహారంగా తీసుకుంటారు. వారు తీసుకునే ఆహారంలో ఇన్‌ గ్రీడియంట్స్‌గా తీసుకోవడంతో మంచి డిమాండ్‌ ఉంది. జెల్లీ ఫిష్‌లో మంచి పోషకవిలువలు అధికంగా ఉండడంతో సలాడ్స్, ఐస్‌క్రీమ్, రోస్టెడ్‌ చికెన్‌ విత్‌ జెల్లీ ఫిష్, రోస్టెడ్‌ డక్‌ అండ్‌ జెల్లీ ఫిష్‌ సలాడ్స్, న్యూడిల్స్‌గా వంటలు తయారు చేస్తుంటారు.
జీవనోపాధి లేక...
చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం మత్స్యకారులకు చెల్లించ వలసిన నష్ట పరిహారాన్ని నేటికీ ఇవ్వలేదు. దీంతో నిషేధ సమయంలో జీవనోపాధిని కోల్పోయిన మత్స్యకారులు ఉపాధి కోసం జెల్లీ ఫిష్‌ చేపల వేట చాటుమాటున చేస్తున్నారు. నిషేధ సమయానికి ముందే నష్ట పరిహారం అందజేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదోమోనని పలువురు అంటున్నారు. ఈ విషయంపై ఎఫ్‌డీఓ రాంబాబును వివరణ కోరగా సముద్ర జలాలలో నిషేధం ఉందని, పాయలలో జెల్లీ ఫిష్‌లను మత్యుకారులు పట్టుకుంటున్నారని అంగీకరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement