జూనియర్ వైద్యుల ధర్నా
Published Wed, Oct 26 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
గుంటూరు మెడికల్ : జూనియర్ వైద్యుల ధర్నాతో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల బుధవారం దద్దరిల్లింది. గైనకాలజీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ డాక్టర్ ఏవీవీ లక్ష్మిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జీజీహెచ్‌లో జూనియర్ వైద్యులు ధర్నా చేశారు. డాక్టర్ సంధ్యారాణి చిత్రపటాన్ని పట్టుకుని, నల్లబ్యాడ్జీలు ధరించి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట బైఠాయించారు. ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీడియాకు వివరణ ఇచ్చేందుకు డాక్టర్ లక్ష్మి అందుబాటులో ఉన్నారని, అయినా పోలీసులు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. పోలీసులు తక్షణమే స్పందించి ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాల వద్దకు ర్యాలీగా వెళ్లి తమకు న్యాయం చేయాలని అక్కడ ధర్నా చేశారు. అడిషనల్ ఎస్పీ భాస్కరరావు జూడాల వద్దకు వచ్చి డాక్టర్ లక్ష్మిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపామని, ఆమెను అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి జీజీహెచ్‌కు వచ్చి అర్ధరాత్రి వరకు ధర్నా కొనసాగించారు. డాక్టర్ సంధ్యారాణి భర్త కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వార్తలు రావడంతో రాత్రి పది గంటల సమయంలో ఆందోళన చేసుత్న్న జూనియర్ వైద్యులు తీవ్రంగా స్పందించారు. పోలీసులు, డాక్టర్ లక్ష్మికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
విమర్శలకు ఖండన...
గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఏవీవీ లక్ష్మి తనపై వచ్చిన వార్తలకు స్పందిస్తూ మీడియాకు వివరణ ఇచ్చిన లేఖలో పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణిపై చేసిన ఆరోపణలను జూడాల సంఘం తీవ్రంగా ఖండించింది. డాక్టర్ సంధ్యారాణి బాగా సంతోషంగా అందరితో కలిసి ఉంటుందని, ప్రొఫెసర్ తప్పు చేసి, చనిపోయిన వైద్య విద్యార్థినిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జూనియర్ వైద్యులు చెప్పారు. డాక్టర్ సంధ్యారాణి ఏ తప్పు చేయలేదన్నారు. ఆస్పత్రి అధికారులు ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీపై తమకు నమ్మకం లేదని, అందరూ వైద్యులే కావడం వల్ల తమకు న్యాయం జరగదని పేర్కొన్నారు. డాక్టర్ సంధ్యారాణి మృతిపై జడ్జితో విచారణ చేయించాలని జూడాలు డిమాండ్ చేశారు. ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసి అరెస్ట్ చేసే వరకు తాము ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. డాక్టర్ సంధ్యారాణి కుటుం బానికి న్యాయం చేయాలని, ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎంఈ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, డాక్టర్ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, జీజీహెచ్ సూపరింటెండెంట్, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.నాగేశ్వరరావు తెలిపారు.
సూపరింటెండెంట్‌తో చర్చలు
ఉదయం నుంచి రాత్రి వరకు ధర్నా చేస్తూ జూడాలు బైఠాయించటంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మెండా ఫర్నికుమార్ జూనియర్ డాక్టర్లను తమ చాంబర్‌కు పిలిపించి మాట్లాడారు. ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మిపై చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై తాము ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నామని, ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. డాక్టర్ లక్ష్మి ప్రవర్తన, ఆమెపై వచ్చిన ఆరోపణ గురించి విచారణ చేసేందుకు ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీ సభ్యులు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లూరి మురళీకృష్ణ, జీజీహెచ్ డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పెనుగొండ యశోధర, జనరల్ మెడిసిన్ వైద్య విభాగాధిపతి డాక్టర్ మోహనరావు కలిసి పీజీ వైద్యులు, బోధనా సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది అందరితో మాట్లాడి నివేదిక తయారు చేసే పనిలో ఉన్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. గురువారం ఉదయంలోపు నివేదిక వస్తుందని, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కు అందజేసి, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Advertisement
Advertisement