జడ్జి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి జైలు
Published Wed, Sep 7 2016 10:31 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
నిజామాబాద్: కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వారిని బెదిరించి, జడ్జి విధులకు ఆటంకం కలిగించిన ఒకరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శీతల్ సరిత బుధవారం తీర్పు ఇచ్చారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయరామ్ నాయక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన రహమాన్ ఓ క్రిమినల్ కేసులో విచారణకు 2013 డిసెంబర్ 17న నిజామాబాద్ ప్రత్యేక ప్రథమశ్రేణి సంచార న్యాయస్థానంలో హాజరయ్యాడు.
ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన అస్మా బేగంభాను, రజియా బేగంలను బెదిరించాడు. వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారా అంటూ కోర్టులోనే హల్‌చల్ చేశాడు. జడ్జి విధులకు ఆటంకం కలిగించాడు. దీంతో అతనిపై ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించారు. ఈ కేసులో జడ్జి సరిత బుధవారం తీర్పు ఇచ్చారు. నిందితుడికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించారు.
Advertisement